భారత్‌కు బైడెన్ చిరకాల మిత్రుడు. సెనేట్ సభ్యునిగా ఇండియాకు చెందిన ఎన్నో అంశాలపై కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షునిగా దేశంలో పర్యటించారు. ఉభయదేశాల మధ్య పౌర అణు ఒప్పందాన్ని కుదర్చడంలో ఆయనదే ప్రముఖ పాత్ర. రెండు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల (రూ.35లక్షల కోట్ల) మేర ద్వైపాక్షిక ఒప్పందం జరగాలని ఆ సందర్భంగానే లక్ష్యంగా పెట్టారు. దానిని ఇంకా అందుకోనేలేదు. అయితే.. ఇప్పుడు బైడెన్ తన బృందంలో భారత్‌పై అవగాహన ఉన్న చాలా మందికి చోటు కల్పించారు. తమ శాఖల పరంగా వీరంతా ఉభయ దేశాల సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
- కమలా హారిస్ (ఉపాధ్యక్షురాలు)
భారత సంతతి వ్యక్తిగా కచ్చితంగా సంబంధాలపై ప్రభావం చూపుతారు. గతంలో 370వ అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతి రేకంగా మాట్లాడారు. వీటిని ఉపసంహరించాలని డిమాండు చేసిన చట్టసభ సభ్యులకు మద్దతు తెలిపారు.
- ఆంటోనీ బ్లింకెన్ (విదేశాంగ మంత్రి)
సుదీర్ఘకాలం విదేశాంగ శాఖలో పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌తో పాటు, ఇతర ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ప్రోత్సహించాలని ఎన్నికల సమయంలో పలుమార్లు చెప్పారు.
- జేక్ సల్లివాన్ (జాతీయ భద్రత సలహాదారు)
చైనాకు పోటీగా భారత్‌కు మద్దతు ఇవ్వాలన్న వాదనను సమర్థించారు. ప్రధాని మోదీ పట్ల విమర్శనాత్మకంగా ఉంటారు. అయితే భారత నాయకులతో వ్యవహరించేటప్పుడు అమెరికా విలువల విషయమై సమతౌల్యం పాటిస్తుండాలని చెబుతుంటారు.
- లాయిడ్ ఆస్టిన్ (రక్షణ మంత్రి)
భారత్‌పై వైఖరి ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. సెంట్‌కాం కమాండర్‌గా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది.
- విలియం బర్న్స్ (సీఐఏ డైరెక్టర్)
విదేశాంగశాఖ ఉప మంత్రిగా భారత్ వ్యవహారాలతో ఆయనకు అనుభవం ఉంది. అణు ఒప్పందాన్ని కుదర్చడంలో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక విధానాల్లో జాతీయ వాదాన్ని చొప్పిస్తుండడాన్ని విమర్శిస్తూ వ్యాసాలు రాశారు.
- క్యాథరిన్ తాయ్ (వ్యాపార ప్రతినిధి)
రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. చర్చలు కొనసాగేలా ఆమె కృషి చేయవచ్చు. ఇందులో ఆమె పాత్రే ప్రముఖం.
- జాన్ కెర్రీ (పర్యావరణ ప్రత్యేక రాయబారి)
విదేశాంగ మంత్రిగా, సెనేటర్‌గా మంచి సంబంధాలు నెరిపారు. పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్ ఒప్పందంలో మళ్లీ అమెరికా చేరడంలో ఈయనే కీలకంగా ఉంటారు.
- నీరా టాండన్ (మేనేజ్‌మెంట్, బడ్జెట్ డైరెక్టర్)
ప్రత్యక్ష సంబంధాలు నెరిపే అవకాశం ఆమెకు ఉండదు. కానీ మంత్రివర్గంలో భారత సంతతి వ్యక్తిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
- సుమన గుహ (దక్షిణాసియా వ్యవహారాలు)
భారత్‌కు సంబంధించిన ఏ విషయంపైన అయినా బైడెన్ తొలుత సంప్రదించేది ఈమెనే.
- కారా అబర్‌క్రోంబే (రక్షణ వ్యవహారాల సీనియర్ డైరెక్టర్)
అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌లో ఇండియా డెస్కును చూసేవారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణులు కొనుగోలుపై తొలుత అభ్యంతరం చెప్పింది కూడా ఈమెనే.
- కర్ట్ క్యాంప్‌బెల్
ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. చైనాతో జరిపే వ్యవహారాల్లో కీలకంగా ఉంటారు.
ఇవీ చూడండి: