మహమ్మారిని అంతమొందించేందుకు ప్రపంచదేశాలు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతోన్న వేళ ఓ దేశ అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఓ అద్భుతమైన టీకా ఉందని తెలిపారు. తమ దేశ ప్రజలను కాపాడడమే లక్ష్యంగా ఆ టీకాను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆయనే వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో.
'ప్రతి నాలుగు గంటలకు నాలుక కింద పది చుక్కలు తీసుకుంటే చాలు అద్భుతం జరుగుతుంది. కొవిడ్ మాయమైపోతుంది' అని మీడియా వేదికగా వెల్లడించారు మదురో. తాము చేసింది చాలా శక్తిమంతమైన వ్యాక్సిన్ అని అన్నారు. కానీ, ఈ టీకా తయారు చేసిందెవరనేది రహస్యంగా ఉంచారు.
ఇదీ చదవండి: ప్రతి మహిళ ఆరుగురికి జన్మనివ్వాలి: నికోలస్ మదురో
వెనెజువెలా శాస్త్రవేత్తలు, ఇతర దేశాల వైద్య నిపుణులు మధురో వ్యాఖ్యలపై అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన జరపకుండా చేసిన ఈ టీకా సామర్థ్యాన్ని నమ్మేదెలా అని అంటున్నారు. స్థానిక జాతీయ వైద్య సంస్థకు చెందిన కొందరు... ఇది 'థైమ్' అనే ఆకు నుంచి తయారు చేసినట్లు భావిస్తున్నారు.
అక్టోబర్‌లోనూ నికోలస్ మదురో కొవిడ్ వ్యాక్సిన్ తయారీపై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ శాస్త్రవేత్తలు ఓ అణువును అభివృద్ధి చేశారని, అది వైరస్‌ను పూర్తిగా అంతం చేస్తుందని అన్నారు. మరో సందర్భంలో ఔషధ గుణాలు కలిగిన ప్రత్యేకమైన టీ తాగినా వైరస్ దరి చేరదని అన్నారు.