అమెరికాలో వేసవి రోజులు శీతాకాలాన్ని తలపిస్తున్నాయి. దక్షిణ డకోటాలోని బ్లాక్ హిల్స్‌పై మంచు తుపాను కురుస్తుండటమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో సుమారు 6 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు మంచు విస్తరించింది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావారణ విభాగం సమీప ప్రాంతాలకు మంచు తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..
మంచు తుపాను ధాటికి కొలరాడో సహా పశ్చిమ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పడిపోయాయి. 90 డిగ్రీలు ఉండే ఉష్ణోగ్రత ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 60డిగ్రీలకు తగ్గింది. ఇక డెన్వర్ ప్రాంతంలో సోమవారం 93 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత.. మంగళవారం నాటికి 32 డిగ్రీలకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాకీ పర్వతాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కడా వేసవి జాడ కనిపించకపోవడం గమనార్హం.
ఆవాసాలను వదిలి..
కెనడా నుంచి వీస్తున్న చల్లటి గాలుల తీవ్రతకు అనేక రాష్ట్రాలను మంచు కప్పివేసింది. ఫలితంగా కొలరాడో, మోంటానా ప్రాంతంలోని చెట్లు, రోడ్లు మంచుమయం అయ్యాయి. భయంకర గాలులు వీస్తుండటం వల్ల.. అక్కడి ప్రజలు తమ ఆవాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
ఇదీ చదవండి: ఆ నగరంలో తుపాకీ సంస్కృతికి 10 మంది బలి