అఫ్గాన్‌లో అమెరికా వైఫల్యాల పరంపర (US in Afghanistan) చివరి వరకు కొనసాగింది. కాబుల్‌ను వీడటానికి కొద్ది రోజుల (US withdrawal from afghanistan) ముందు విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు అగ్రరాజ్యాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. దీంతో చివర్లో రెండుసార్లు డ్రోన్‌దాడులు (US drone strike) నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తొలుత ప్రకటించింది. కానీ, అఫ్గాన్ గడ్డపై అమెరికా చేసిన చిట్టచివరి దాడిలో అమాయకులైన 10 మంది (Kabul drone strike civilian casualties) చనిపోయారు. ఈ విషయాన్ని అమెరికా సైనిక జనరల్స్ తొలుత అంగీకరించలేదు. కానీ, చివరకు అక్కడి పత్రికలు ఆధారాలతో బయటపెట్టాయి. అయిన కొన్నాళ్లు బుకాయించాక చివరికి అమెరికా సెంట్ కామ్ కమాండర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
చనిపోయింది ఎవరు..?
కాబుల్ డ్రోన్ దాడిలో చనిపోయిన వ్యక్తిపేరు జమారీ అహ్మదీ. అతను 2006 నుంచి కాలిఫోర్నియాకు చెందిన యుఎస్ ఎయిడ్ గ్రూప్‌లో (Kabul drone strike aid worker) ఎలక్ట్రికల్ ఇంజినీరగా పనిచేస్తున్నారు. దాడి జరిగిన రోజు ఉదయం ల్యాప్‌టాప్ తీసుకోవడానికి ఆఫీస్‌కు రావాలని అతనికి బాస్ నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇంటి నుంచి బయల్దేరి వెళ్లే సమయంలో మరో ఇద్దరిని ఎక్కించుకొన్నారు. మరికొద్ది సేపటికి తన బాస్ ఇంటి సమీపంలోకి వెళ్లారు. తన విధుల్లో భాగంగా స్థానిక తాలిబన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శరణార్థులకు భోజనాలు ఇచ్చేందుకు అనుమతులు తీసుకొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ఆఫీస్‌కు చేరుకొన్నారు. అనంతరం అక్కడే ఉన్న ఓ గార్డు సాయంతో ఇంటికి తీసుకెళ్లేందుకు కొన్ని క్యాన్లలో నీటిని నింపుకొన్నాడు. ఆ క్యాన్లను కార్లోకి ఎక్కించే సమయంలో డ్రోన్‌ను పర్యవేక్షించే వ్యక్తులు వాటిని పేలుడు పదార్థాలుగా భ్రమించారు. ఆ తర్వాత ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో వారిని దించేసి విమానాశ్రయానికి సమీపంలోని ఇంటికి వచ్చాడు. అప్పటికి సాయంత్రం 4.50 అవుతుంది. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా.. డ్రోన్ ఆపరేటర్‌కు వాహనంలో ఒకే వ్యక్తి కనిపించాడు. దీంతో టాక్టికల్ కమాండర్ ఆదేశాలతో హెల్‌ఫైర్ క్షిపణిని ప్రయోగించారు. వాస్తవానికి అహ్మదీ రాగానే ఇంట్లోని చిన్నపిల్లలు సంతోషంతో ఆ కారును చుట్టుమట్టారు. అదే సమయంలో క్షిపణి తాకింది.
సీఐఏ హెచ్చరించే సమయానికి చేదాటిపోయింది..
అహ్మదీ ప్రయాణించిన ప్రాంతాల్లో ఒక చోట నుంచి తెలుపు రంగు టయోటా కరోలా వాహనంపై నుంచి కాబుల్ ఎయిర్‌పోర్టు పైకి రాకెట్లతో (US drone strike Afghanistan) దాడి జరిగింది. అహ్మదీ వాహనం కూడా తెలుపు రంగు టయోటా కరోలా కావడంతో డ్రోన్ నిఘా పరిధిలోకి వచ్చాడు. అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రేపర్ డ్రోన్ కొన్ని గంటలపాటు అహ్మదీ కారుపై నిఘా ఉంచింది.
దాడి చేయడానికి చివరి నిమిషంలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA) హెచ్చరికలు జారీ చేసింది. లక్ష్యానికి సమీపంలో ప్రజలు, పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. కానీ, అప్పటికే బాగా ఆలస్యం జరిగింది. హెల్‌ఫైర్ క్షిపణి వాహనాన్ని తునాతునకలు చేసింది. మొత్తం 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మూడేళ్ల చిన్నారి అయిమల్ అహ్మదీ కూడా ఉంది.
మొండిగా సమర్థించుకొని.. ఆపై మాట మార్చి..!
ఈ దాడిపై పలు విమర్శలు వెల్లవెత్తాయి. పెంటగాన్ తన చర్యను మొండిగా సమర్థించుకొంది. కానీ, దర్యాప్తు జరిగాక అమెరికా సెంట్ కామ్(సెంట్రల్ కమాండ్) కమాండర్ జనరల్ మెకంజీ మాట్లాడుతూ నాడు డ్రోన్ దాడిలో చనిపోయిన వారికి ఐసిస్-కె సంబంధాలు లేవని తెలిపారు. బాధిత కుటుంబానికి అమెరికా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ దారుణానికి తనదే పూర్తి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. "టయోటా తెలుపు రంగు కరోలా కారుపై మాకు వచ్చిన సమాచారం తప్పు" అని పేర్కొన్నారు.
దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలి..
అహ్మదీ కుటుంబ సభ్యులు ఈ దాడితో కుదేలైపోయారు. తమ పై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కుటుంబ సభ్యులు మరణించిన ఇంట్లో తాము ఉండలేకపోతున్నట్లు వాపోయారు. వీలైతే అఫ్గానిస్థాన్ నుంచి బయటకు తరలించాలని కోరారు. దాడికి కారణమైన అమెరికా సైనిక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అహ్మదీ సోదరుడు కోరాడు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: