ట్రంప్ ప్రభుత్వం, యూఎస్ కాంగ్రెస్ 450 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ఆమోదించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్యాకేజీకి ఆమోదం లభిస్తే... చిన్న వ్యాపారులకు రుణాలు మంజూరు; ఆసుపత్రులకు, కరోనా పరీక్షల నిర్వహణకు నిధులు అందనున్నాయి.
ఆశాభావం
కరోనా ధాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చిన్న చిన్న వ్యాపారాలు తీవ్రంగా నష్టపోవడం వల్ల... ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ 450 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీ అందించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి త్వరలో ఆమోదం లభిస్తుందని అమెరికా ఖజానా కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారంలోపు ఒప్పందం కుదిరే అవకాశముందని సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ అన్నారు.
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది?
కరోనా దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని స్టీవెన్ మ్నుచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలు కాదు కేవలం కొన్ని నెలల్లోనే యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా రవాణా, పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫలితంగా 22 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలోని 330 మిలియన్ల జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి: 'సిక్కుల పవిత్ర కట్టడాన్ని పరిరక్షించండి'