1969 జులై 20... కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ అనే ఇద్దరూ అమెరికా వ్యోమగాములు.. అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్‌ను చంద్రుడిపై దించారు. కొన్ని గంటల తర్వాత చంద్రుడిపై నడిచిన మొట్టమొదటి మనిషిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్ర పుటలకెక్కారు. ఈ ఖగోళయాత్రను 65కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.
చంద్రుడిపైకి మనుషులు వెళ్లినట్లు సాక్ష్యాలున్నా కొంతమంది విశ్వసించటం లేదు. చంద్రుడిపైకి వెళ్లటం కట్టుకథ అనే వారిని కుట్ర సిద్ధాంతకర్తలుగా వ్యవహరిస్తుంటారు. అదంతా నాసా ఆడిన నాటకమని వారి వాదన. కుట్ర సిద్ధాంతకర్తల వాదనను కొట్టివేసేందుకు నాసా శాస్త్రవేత్తలు తరచూ ఆధారాలు చూపుతుంటారు.
నక్షత్రాలు లేవే..!
మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవారు పలు కారణాలు చూపిస్తున్నారు. అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి తీసిన ఫొటోల్లో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు రుజువుగా పేర్కొంటారు. చంద్రుడి మీద గాలి లేదంటే ఆకాశం నల్లగా ఉంటుంది. నక్షత్రాలు లేకపోవటం విచిత్రమైన విషయమని మరికొందరి వాదన.
నాసా శాస్త్రవేత్తలు మాత్రం నక్షత్రాలు కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నాయని అంటారు. మనం ఫొటో తీసేటప్పుడు ఏది ప్రధానం అనుకుంటే దానిపైనే ఫోకస్ పెడతామని, అదేవిధంగా కెమెరా చంద్రుడిపై ఉన్న వ్యోమగాములపై ఫోకస్ చేస్తుంది కానీ నక్షత్రాల మీద కాదన్నది శాస్త్రవేత్తల వాదన.
జెండా గాలికి ఊగిందా...!
చంద్రుడిపై అమెరికా జెండా చాలా ప్రఖ్యాతిగాంచింది. ఆ క్షణంలో తీసిన ఫొటోల్లో జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇదీ అనుమానాలకు తావిచ్చింది.
"చంద్రుడిపై అమెరికా జెండా గాలిలో కదలాడినట్లు కనిపిస్తుంది. అయితే చంద్రుడిపై గాలి లేనందున జెండా ఎలా కదులుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు. జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపించినా అది నిజం కాదు. చంద్రుడి ఉపరితలంపై జెండా పాతినప్పుడు కదిలి ఉంటుంది. వంగిన రూపం అలాగే ఉండి ఉంటుంది. వీడియోల్లో జెండా ముందుకు, వెనక్కి కదులుతున్నట్లు కనిపిస్తుంది. వ్యోమగాములు జెండాను పాతే సమయంలో ముందుకు వెనక్కి తిప్పారు. దానివల్ల జెండాలో కదలికలు ఏర్పడి ఉంటాయి."
- ఎమిలీ డ్రాబెక్ మౌండర్, నాసా శాస్త్రవేత్త
అణు ధార్మికత మాటేమిటి..!
మరికొందరు చంద్రుడిపై అంతరిక్ష నౌక ప్రయాణాలనూ విశ్వసించరు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలెన్ బెల్టులనే భారీ అణుధార్మిక వలయాల వల్ల చంద్రుడిపైకి ప్రయాణమే అసాధ్యమని అంటారు. ఈ వలయాలను దాటి వెళ్తే అణుధార్మికతకు గురవుతారని వాదిస్తుంటారు. కొన్నిగంటల వ్యవధిలో 200 నుంచి 1,000 రాడ్ల అణుధార్మికతకు గురైనప్పుడే అణుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది.
అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు వాన్ అలెన్ వలయాల పరిధిలో 2గంటల కన్నాతక్కువ సమయమే ప్రయాణించినందున అణుధార్మికతకు గురికాలేదని అంటారు నాసా శాస్త్రవేత్తలు. 12రోజుల ప్రయాణంలో సగటు అణుధార్మిక మోతాదు 0.18రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్-రే తీసినప్పుడు గురయ్యే అణుధార్మికతతో సమానం.
ఇది మరో సాక్ష్యం..
వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీది నుంచి రాళ్లు తీసుకురావటం మరో సాక్ష్యంగా చెబుతారు శాస్త్రవేత్తలు. వాళ్లు చంద్రుడిపై నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిపై దశాబ్దాలపాటు చాలా దేశాలు అధ్యయనం చేశాయి. ఆ రాళ్లు నిజంగా చంద్రుడిపై నుంచి తెచ్చినవేనని నిర్ధరించాయి.
చంద్రుడిపైకి వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ల్యాండ్ అయిన గుర్తులు, వ్యోమగాముల పాదముద్రలను అంతరిక్షం నుంచి చూడవచ్చు. జీవం ఉన్న గ్రహాలపై సంభవించే ఉపరితల కార్యకలాపాలతో పాదముద్రలు, ఇతర గుర్తులు సులభంగా చెరిగిపోతాయి. చంద్రుడిపై అలాంటి పరిస్థితులు లేనందున పాదముద్రలు అలాగే ఉన్నాయి. 2009 నుంచి చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న నాసా లూనార్ ఆర్బిటర్ అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాల ఫొటోలను తీసింది. అపోలో అంతరిక్ష నౌక దిగిన కచ్చితమైన ప్రదేశాలే కాదు.. చంద్రుడిపై అన్వేషణ కోసం సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. భారత్, చైనా, జపాన్ స్వతంత్రంగా ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలూ అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.
చందమామను చేరింది పరిశోధనల కోసం తప్ప కేవలం వినోదం కోసం కాదు. చంద్రుడి గురించి మరింత తెలుసుకునేందుకు అనేక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. కొన్ని అక్కడే వదిలేశారు. వాటిలో రెట్రో రిఫ్లెక్టర్లు ఉన్నాయి. ఈ లూనార్ రిఫ్లెక్టర్లు 1969 నుంచి భూమి-చంద్రుడి మధ్య దూరాన్ని కచ్చితంగా కొలిచేందుకు ఉపయోగపడ్డాయి. అవి కొన్ని ఇంకా పనిచేస్తున్నాయి.
ఇదీ చూడండి:- చంద్రయాన్: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం