శిరచ్ఛేదనలు, సామూహిక మరణశిక్షలు, అత్యాచారాలు, అపహరణలతో సాగిన ఇస్లామిక్ స్టేట్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ హింసాత్మక ప్రయాణానికి తెరదించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ చేసిన ప్రకటనపై.. ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
టర్కీ అధ్యక్షుడి స్పందన
తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా- టర్కీ సేనలు సంయుక్తంగా సాగిస్తున్న పోరాటంలో బాగ్దాదీ మరణం కీలకమలుపుగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగాన్ అభివర్ణించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇకపైనా తమ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బాగ్దాదీ మరణం ఓ మైలురాయి..
బాగ్దాదీని హతమార్చామన్న ట్రంప్ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించారు. బాగ్దాదీ మరణాన్ని ఓ ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. తీవ్రవాదంపై పోరును కొనసాగించాల్సిన అవసరముందన్నారు.
ముఖ్యమైన క్షణం..
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో బాగ్దాదీ మృతి ఒక ముఖ్యమైన క్షణమన్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. చెడుకు వ్యతిరేకంగా యుద్ధం ఇంకా ముగియలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు. డాయిష్ హంతక, అనాగరిక కార్యకలాపాలను అంతం చేసేందుకు సంకీర్ణ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
డాయిష్ తీవ్రవాదానికి ఎదురుదెబ్బ..
డాయిష్ తీవ్రవాదానికి బాగ్దాదీ మరణం గట్టి ఎదురుదెబ్బగా పేర్కొన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్. అయితే ఇది ఒక దశ మాత్రమేనని ట్వీట్ చేశారు. తీవ్రవాద సంస్థలు పూర్తిగా ఓటమి పాలయ్యేంత వరకు అంతర్జాతీయ స్థాయిలో తమ సహకారం ఉంటుందన్నారు.
నాటో స్పందన
ఈ ఆపరేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన దశగా అభివర్ణించారు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నా
టో) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్. ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి నాటో కట్టుబడి ఉన్నట్లు ట్వీట్ చేశారు.
రష్యా అనుమానం..
బాగ్దాదీ చనిపోయినట్లు 2014 నుంచి చాలాసార్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో బాగ్దాదీ మృతిపై రష్యా అనుమానం వ్యక్తం చేసింది. ఇడిబ్‌లోని డీ ఎస్కలేషన్ జోన్‌లో అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్ గురించి విశ్వసనీయ సమాచారమేదీ తమ రక్షణ మంత్రిత్వశాఖ వద్ద లేదని వెల్లడించింది. ఆపరేషన్ విజయవంతంపై అమెరికన్ సేనలు చెబుతున్న వివరాలు అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయని పేర్కొంది.
ఇది ముగింపు కాదు..
బాగ్దాదీ మరణంతో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థకు ముగింపు పడినట్లు కాదని ఇరాన్ అభిప్రాయపడింది. బాగ్దాదీ మృతి డాయిష్ తీవ్రవాదంపై పోరాటానికి అంతం కాదని... ఓ అధ్యాయం మాత్రమే ముగిసిందని పేర్కొంది. అమెరికా విధానాల కారణంగా ఐసిస్ తీవ్రవాదం పెరుగుతూనే ఉందని ఇరాన్ అభిప్రాయపడింది.
బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు: ట్రంప్
ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేతసౌధంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు. ‘అమెరికా భద్రతా దళాలు బాగ్దాదీ వెంట పడగా అతడు ప్రాణ భయంతో పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తాను పేల్చుకున్నాడని’ ట్రంప్ పేర్కొన్నారు. చనిపోయే ముందు బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను హతమార్చాడని అగ్రరాజ్యం అధ్యక్షుడు తెలిపారు.
ఇదీ చూడండి: నేడు సౌదీ అరేబియాకు వెళ్లనున్న ప్రధాని మోదీ..