హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా సైనిక కార్యకలాపాలను తిప్పికొట్టడంలో భారత్ పాత్రపై అమెరికా కాంగ్రెస్‌లోని కీలక కమిటీ శుక్రవారం చర్చించింది. ఈ అంశంపై భారత్ నాయకత్వ పాత్ర పోషించేలా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కొద్ది రోజుల ముందు చోటుచేసుకున్న ఈ చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.
యూఎస్సీసీలో..
అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ (యూఎస్‌సీసీ) అనే ఈ కమిటీ ఎదుట పలువురు నిపుణులు తమ వాదనలను వినిపించారు. ‘ఆసియా మ్యారిటైమ్ ట్రాన్స్‌పరెన్సీ ఇనీషియేటివ్’ డైరెక్టర్ గ్రెగరీ బి పోలింగ్ మాట్లాడుతూ.. భారత్‌తో సముద్రతల సహకారాన్ని అమెరికా బలోపేతం చేసుకోవాలని కోరారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా-చైనా ప్రయోజనాల నడుమ ఘర్షణ తలెత్తుతుందని రక్షణ శాఖ అసిస్టెంట్ డిప్యూటీ కార్యదర్శి చాద్ బ్రేగియా చెప్పారు. అందువల్ల అక్కడ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలన్నారు. మరికొన్ని దేశాలతో మైత్రి అవసరమని చెప్పారు. అమెరికా నౌకాదళ యుద్ధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇసాక్ బి కార్డన్ మాట్లాడుతూ.. ‘‘పాక్‌తో ఉన్న అసాధారణ రాజకీయ, సైనిక, ఆర్థిక బంధం చైనా నౌకాదళ కార్యకలాపాల విస్తరణకు ప్రధాన కారణమవుతోంది. ఈ దేశంతో పాటు ఉత్తర కొరియా, కాంబోడియా వంటి దేశాలు కూడా చైనాకు రహస్యంగా సహకరించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం చైనా సైన్యానికి విదేశాల్లో జిబౌటిలో మాత్రమే స్థావరం ఉంది. అయితే కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌లో చైనా ఉపగ్రహ నేవిగేషన్, పొజిషనింగ్ కేంద్రం, సైనిక స్థావరం ఉనికిని ధ్రువీకరించే ఒక రహస్య పత్రం తమకు దొరికిందని ఆస్ట్రేలియా మీడియా ఇటీవల పేర్కొంది. కాంబోడియాలో వైమానిక స్థావరం ఏర్పాటు చేస్తే వియత్నాం, బ్యాంకాక్, థాయ్‌లాండ్, మలాకా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రంలో సైనిక పాటవాన్ని చాటడానికి చైనాకు వీలు కలుగుతుందని పోలింగ్ చెప్పారు. ‘‘పాక్‌లోని గ్వాదర్ రేవును ఏదో ఒక రోజు సైనిక స్థావరంగా మారుస్తుందని భారత్ చాలా కాలంగా అనుమానిస్తోంది’’ అని కార్డన్ చెప్పారు.
- సంజీవ్ బారువా, ఈటీవీ భారత్
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆయన భద్రత మరీ ఆ రేంజ్లో ఉంటుందా?