భారత్ హెచ్ 1బీ వీసాదారుల వల్ల భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశాంగమంత్రి జయ్శంకర్ పునరుద్ఘాటించారు. వాషింగ్టన్లో భారత్- అమెరికా మధ్య జరిగిన రెండో దఫా 2+2 సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"యూఎస్‌లోని భారతీయులు, భారతీయ-అమెరికన్లు సాధించిన విజయాలు.. అలాగే అమెరికన్ సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలకు వారు చేస్తున్న కృషికి మేము చాలా గర్వపడుతున్నాము. వీరి వల్ల ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి." - జయ్శంకర్, భారత విదేశాంగమంత్రి
మరింత ముందుకు..
ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని జయ్శంకర్ తెలిపారు. బహుళ స్థాయిల్లో వీటిని కొనసాగించేందుకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయని కూడా ఆయన అన్నారు.
భారత్- అమెరికా పరస్పర సహకారం
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ అవకాశాలను భారత్ అందిస్తుందని జయ్శంకర్ తెలిపారు. ఛబహార్ ప్రాజెక్టుకు అమెరికా తన మద్దతును పునరుద్ధరించినందుకు పాంపియోను కూడా జైశంకర్ ప్రశంసించారు. ఇది అఫ్గానిస్థాన్‌కు ఎంతో ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం చర్చలు ఇరుదేశాలను సంతృప్తిపరిచే సమతుల్య ఫలితాన్ని ఇస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్-అమెరికాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో పరస్పర సహకార ఒప్పందం చేసుకున్నాయని, ప్రస్తుతం వాటిని అమలుచేస్తున్నామని జయ్శంకర్ వెల్లడించారు.
నీటి నిర్వహణ
నీటి నిర్వహణ విషయంలో సహకారం, నాణ్యత అంచనాలు తదితర అంశాలపై భారత్.. యూఎస్ జియోలాజికల్ సర్వేతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జయ్శంకర్ వెల్లడించారు.
వాణిజ్య ఒప్పందం!
యూఎస్ విదేశాంగమంత్రి మైక్ పాంపియో కూడా భారత్-అమెరికాలు న్యాయమైన, పరస్పర వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయని వెల్లడించారు.
గత 24 నెలల్లో భారత్‌కు అమెరికా.. ముడి చమురు, ఎల్ఎన్జీ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకుపైగా పెరిగాయని పాంపియో తెలిపారు. రెండు మిత్రదేశాలు, భాగస్వాములు మధ్య ఇలాంటి సంబంధాలు చాలా గొప్పగా సాగుతున్నాయని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. అభిశంసనకు ప్రతినిధులసభ ఆమోదం