సిరియాకు మానవతా దృక్పథంతో సహాయం చేసే అంశాన్ని రాజకీయం చేయొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సభ్యదేశాలకు భారత్ సూచించింది. రాజకీయ కోణంలో చూడటం వల్ల.. ఆ దేశం అత్యవసర సాయాన్ని కోల్పోతోందని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి అన్నారు.
"సిరియా స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం అక్కడివారికి సాయం చేయడం ఆవశ్యకం. ఈ పరిస్థితుల్లో అందరూ ఆ దేశాన్ని ఆదుకోవాల్సిన అవసరముంది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల.. అక్కడి పౌరులు అత్యవసర సాయాన్ని కోల్పోతున్నారు."
- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత రాయబారి
ఆపదలో ఉన్న సిరియా ప్రజలను వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ఈ నెలారంభంలో ఆ దేశానికి భారత్.. 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అయితే.. గతేడాది జులైలో కొవిడ్ సంక్షోభం నెలకొన్న సమయంలోనూ 10 మెట్రిక్ టన్నుల ఔషధాలను సిరియాకు పంపి మానవతా వాదాన్ని చాటుకుంది భారత్.
2011లో అరబ్ కాలంలో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు వ్యతిరేకంగా శాంతియుత తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ ఘర్షణతో నాటి నుంచీ అక్కడి ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఆ దేశ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదీ చదవండి: 'ఖేలో ఇండియా'కు ముందు స్కైయర్ల విన్యాసాలు