కొవిడ్-19 నుంచి కోలుకున్న వారు తిరిగి ఆ మహమ్మారి బారినపడకుండా కనీసం ఆరు నెలలు, అంతకన్నా ఎక్కువ కాలమే రక్షణ లభిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ సోకిన చాలాకాలం తర్వాత కూడా వారి రోగ నిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉంటుందని చెప్పారు. దక్షిణాఫ్రికా రకం సహా.. మార్పులకు లోనైన కరోనా వైరస్‌లనూ ఇది అడ్డుకునే వీలుందని అమెరికాలోని రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వివరించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు బాధితుల రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంటాయి. వారి రక్తంలోని ప్లాస్మాలో కొన్నివారాలు లేదా నెలలపాటు అవి కొనసాగుతాయి. కాలం గడిచేకొద్దీ వాటి స్థాయి తగ్గిపోతుందని ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. యాంటీబాడీలను అన్ని సమయాల్లోనూ ఉత్పత్తి చేయడానికి బదులుగా.. మెమరీ బి కణాలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని తాజాగా పరిశోధకులు తెలిపారు. వైరస్ రోగ నిరోధక వ్యవస్థను 'గుర్తుపెట్టుకుంటుంద'ని, వాటికి భవిష్యత్తులో ఎప్పుడైనా కరోనా వైరస్ తారసపడితే వెంటనే వాటిని గుర్తించి, తక్షణం యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.
కొవిడ్ సోకిన 87 మందిపై... ఇన్ఫెక్షన్ బారినపడిన నెల తర్వాత ఒకసారి, ఆరు నెలల అనంతరం మరోసారి యాంటీబాడీల స్పందనపై పరిశీలించారు శాస్త్రవేత్తలు. ఆరు నెలల తర్వాత వీరిలో యాంటీబాడీలు తగ్గాయని తేల్చారు. వ్యాధి నయమైనప్పటికీ దానిపై పోరాటం చేయడానికి అవసరమైన యాంటీబాడీల నాణ్యతను అవి మెరుగుపరుస్తున్నాయనడానికి గట్టి ఆధారాలను సేకరించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్‌ను రెండు రోజులు అడ్డుకునే నాసల్ స్ప్రే