అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన అభియోగాలను జ్యుడీషియరీ కమిటీ ఆమోదించింది. అధికార దుర్వినియోగం సహా ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ చేపడుతున్న దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారన్న అభియోగాలను ధ్రువీకరించింది. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సభ్యులుగా ఉన్న జ్యుడీషియరీ కమిటీలో 23-17 ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ప్రతినిధుల సభలో అధ్యక్షుడి అభిశంసనపై ఓటింగ్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే వారం.. పూర్తిస్థాయి సభలో ఓటింగ్ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రతినిధుల సభలో నెగ్గినా.. సెనేట్‌లో కష్టమే...!
ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు భారీ మెజారిటీ ఉన్నందున అభిశంసన ఓటింగ్‌లో సులువుగా నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఎగువసభ అయిన సెనేట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీకి సాధారణ మెజారిటీ ఉంది. రిపబ్లికన్ సభ్యులు ఫిరాయింపులకు పాల్పడితే తప్పా సెనేట్‌లో అభిశంసన ప్రక్రియ కొనసాగే అవకాశం లేదు.
అంతకుముందు ట్రంప్ అభిశంసన తీర్మానంపై జరిగిన చర్చలు సుదీర్ఘంగా సాగాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ట్రంప్‌పై మోపిన అభియోగాలపై రిపబ్లికన్ సభ్యులు సవరణలు ప్రతిపాదించారు. అయితే డెమొక్రాట్ల మెజారిటీ ఉండటం వల్ల వీరి ప్రతిపాదన వీగిపోయింది.
'మోసం, దగా'
తనపై మోపిన అభియోగాలకు జ్యుడీషియరీ కమిటీ ఆమోదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అభిశంసన ప్రక్రియను మోసం, దగా అంటూ అభివర్ణించారు. ప్రజాదరణ లేని అభిప్రాయాలతో రాజకీయ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నాలంటూ విమర్శించారు. సెనేట్‌కు చేరుకున్న తర్వాత అభిశంసన ప్రక్రియ సుదీర్ఘంగా సాగదని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లు నిర్ణయించిన దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
స్పందించిన శ్వేతసౌధం
అధ్యక్షుడిపై జరుగుతున్న అభిశంసన ప్రక్రియపై శ్వేతసౌధం స్పందించింది. ఇవన్నీ నిరాశపూరిత అవాస్తవాలుగా అభివర్ణించింది.
"జ్యుడీషియరీ కమిటీలో అభిశంసనపై జరుగుతున్న దర్యాప్తు అవమానకరంగా ముగిసింది. తీర్మానాన్ని సెనేట్‌లో ఆహ్వానించడానికి అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారు. సభలో అవమానకరంగా జరిగిన ప్రక్రియకు సెనేట్‌లో సరైన జవాబు వస్తుంది."
-శ్వేతసౌధ మీడియా కార్యదర్శి
ఇదీ చూడండి: బ్రిటన్ ఎన్నికల్లో ప్రవాస భారతీయుల హవా