అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్- హారిస్ ద్వయం వచ్చే ఏడాది జనవరి 20న శ్వేతసౌధంలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో వాళ్ల జీవిత భాగస్వాములపై చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రథమ మహిళ జిల్ బైడెన్ తన బోధనను కొనసాగిస్తారని.. సెకండ్ జెంటిల్మన్ డౌగ్ ఎమాఫ్ తన భార్యకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
శ్వేతసౌధంలో ప్రవేశించాక డౌగ్ ఎమాఫ్ తన న్యాయవాద వృత్తిని వదిలేయాలని నిర్ణయించుకున్నారని ఆయన ప్రతినిధి తెలిపారు. శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలి భర్తగా తన పాత్రపై దృష్టి సారిస్తారని స్పష్టం చేశారు. పాలనలో హారిస్‌కు సహకరించేందుకు డౌగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే అధికార బదిలీ బృందంతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు.
ప్రముఖ న్యాయవాదిగా..
దక్షిణ కాలిఫోర్నియాలో హైప్రొఫైల్ ఎంటర్టైన్మెంట్ న్యాయవాదిగా డౌగ్కు మంచి పేరుంది. హారిస్ ప్రచారంలో డౌగ్ కీలకంగా పనిచేశారు. ప్రైమరీల్లోనూ హారిస్‌కు నామినేషన్ లభించినప్పుడు డౌగ్ చాలా కృషి చేశారు. హారిస్‌కు డౌగ్ 'రహస్య ఆయుధం' అంటూ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.
భార్యకు అభినందనలు..
ఉపాధ్యక్షురాలిగా హారిస్ గెలుపొందారన్న వార్తలపై డౌగ్.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రేమపూర్వక అభినందనలు'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. హారిస్ ఉపాధ్యక్షురాలిగా గెలుపొందడంపై చాలా గర్వంగా ఉంది అని చెబుతూ ఆమెను కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేశారు. కమలా హారిస్ కూడా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు డౌగ్ను పరిచయం చేశారు.
ఇదీ చూడండి: బైడెన్ సమీక్షా బృందాల్లో 20 మంది భారతీయులు