అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు రష్యా, చైనా, ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు, సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు తెలిపింది. అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, బైడెన్ ఇద్దరినీ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. రోజులు దగ్గరపడుతున్న కొద్దీ హ్యాకర్లు తమ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసినట్లు తెలిపింది.
రష్యాకు చెందిన స్ట్రాంటియమ్, చైనాకు చెందిన జిర్కోనియం, ఇరాన్‌కు చెందిన ఫాస్పరస్ అనే సంస్థలు ఈ మేరకు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న దాదాపు 200 కన్సల్టింగ్ సంస్థలు, మేధో సంస్థలు, రాజకీయ పార్టీలను స్ట్రాంటియమ్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇదే స్ట్రాంటియమ్ 2016 ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఎన్నికల ప్రచారంపై విషం చిమ్మినట్లు రాబర్ట్ ముల్లర్ కమిటీ తేల్చినట్లు గుర్తుచేసింది.
ఇక చైనాకు చెందిన జిర్కోనియం ఉన్నత స్థాయి వ్యక్తుల్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అంతర్జాతీయ వ్యవహారాల్ని ప్రభావితం చేసే వ్యక్తులు, బైడెన్ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నవారు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ముఖ్యమైన వ్యక్తులే లక్ష్యంగా జిర్కోనియం ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌కు చెందిన ఫాస్పరస్.. ట్రంప్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలపై దాడికి దిగినట్లు గుర్తించింది.
ఆయా పరికరాల్లో ఉన్న సెక్యూరిటీ టూల్స్‌తో హాకర్ల కుట్రలను చాలా వరకు ముందుగానే గుర్తించామని మైక్రోసాఫ్ట్ వివరించింది. అలాగే సదరు వ్యక్తులకు విషయాన్ని తెలియజేసి అప్రమత్తం చేశామని తెలిపింది.
ఇదీ చూడండి: ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్ మధ్య డీల్..!