వలసయేతర వీసా విధానాల్లో భారీ సంస్కరణల కోసం అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టింది ఓ చట్టసభ్యుల బృందం. హెచ్-1బీ ఉద్యోగ వీసా కేటాయింపుల్లో.. అమెరికాలో చదువుకున్న విదేశీ సాంకేతిక నిపుణులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
"హెచ్-1బీ అండ్ ఎల్-1 రిఫార్మ్ యాక్ట్"ను ప్రతినిధుల సభలో బిల్ పాస్చ్రెల్, పౌల్ గోసర్, రో ఖన్నా, ఫ్రాంక్ పల్లోనె, లాన్స్ గూడెన్ ప్రవేశపట్టారు. సెనేట్లో... చుక్ గ్రాస్లే, డిక్ డర్బిన్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనితో వార్షిక హెచ్-1బీ వీసా కేటాయింపుల్లో తొలిసారిగా.. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
అమెరికాలో చదువుకుంటున్న నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యం దక్కేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉన్నత డిగ్రీ ఉన్నవారు, ఇప్పటికే వేతనాలు భారీగా అందుతున్న వారు, మంచి నైపుణ్యం ఉన్నవారికి కూడా ఈ వ్యవస్థతో లబ్ధిపొందాలని బిల్లులో ప్రతిపాదించారు.
నిబంధనలు అమలు చేయడం, వేతనాల్లో మర్పులు చేయడం, అమెరికా ఉద్యోగులు, వీసాదారుల రక్షణను పెంపొందించడం వల్ల హెచ్-1బీ, ఎల్-1 వీసా విధానాల ముఖ్య ఉద్దేశాన్ని కాంగ్రెస్ తిరిగి అమలు చేసినట్టు అవుతుందని చట్టసభ్యులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఉద్యోగులను హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులతో భర్తీ చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. హెచ్-1బీ వర్కర్లను నియమించడం వల్ల అమెరికా ఉద్యోగుల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కంపెనీలు.. హెచ్-1బీ, ఎల్-1 ఉద్యోగులను తాత్కాలిక శిక్షణ కోసం నియమించుకుని.. తిరిగి వారి సొంత దేశాలకు పంపించి వేయాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు. ప్రత్యేకంగా ఈ చట్టం వల్ల 50కి మించిన ఉద్యోగులు ఉన్న కంపెనీలు.. (వీరిలో సగంమంది హెచ్-1బీ, ఎల్-1 ఉద్యోగాలు ఉన్నవారు) అదనంగా హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోలేవు.
కొన్ని సంస్థలు ప్రోగ్రామ్ను ఉపయోగించుకుని.. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి.. వారి స్థానాల్లో తక్కువ జీతాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయని చట్టసభ్యుడు గ్రాస్లే ఆరోపించారు. అందుకే ఈ సంస్కరణలు ప్రతిపాదించినట్టు.. వీటి వల్ల అమెరికాలోని నైపుణ్యం ఉన్నవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అంతే కానీ వారిని భర్తీ చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. ధ్వంసమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిచేయడానికి ఈ సంస్కరణలు అవసరమని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.