కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా భారత వైజ్ఞానిక రంగం చేస్తున్న కృషిని ప్రపంచ స్థాయి నాయకులు కీర్తిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కారణంగానే ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకా అందించడంలో భారత్ కేంద్రంగా మారిందని కితాబిచ్చారు.
"కరోనా వైరస్ను అంతం చేసే దిశగా.. టీకా అభివృద్ధి చేయడంలో భారత వైజ్ఞానిక రంగం కృషిని అభినందించక తప్పదు. సమర్థ నాయకత్వంతోనే ఇది సాధ్యం అయింది."
-బిల్గేట్స్, బిల్&మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు
"ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. నిరంతర కృషితో కరోనాకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్ణయాత్మక చర్యలతో మహమ్మారికి ముగింపు పలకబోతున్నాం. అందరం కలిసికట్టుగా ఉంటే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చు. భారత్ ఉత్పత్తి చేస్తోన్న టీకాలపై మాకు విశ్వాసం ఉంది. ఈ టీకాలు వైరస్ నుంచి సమర్థంగా, సురక్షితంగా ప్రపంచ మానవాళిని రక్షించగలవని నమ్ముతున్నాం."
- టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్
డీసీజీఐ భారత్లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ప్రపంచంలోనే పెద్దమొత్తంలో టీకాలు వేసే ప్రక్రియ దేశంలో ప్రారంభం కానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఉత్పత్పి చేస్తోన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంపై ప్రశంసలు కురిపించారు మోదీ.
దేశీయంగా తయారు చేస్తోన్న వస్తువులకు 'ప్రపంచ స్థాయిలో డిమాండ్ పెరగడమే కాక ప్రజామోదం పొందగలవు" అని అన్నారు. ఈ క్రమంలో సమస్త మానవాళికి టీకాను అందించడంలో భారత్ ముందుంటుందని తెలిపారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ 150కు పైగా దేశాలకు వైద్య ఉత్పత్తులను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.