ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహావిలయం కొనసాగుతోంది. రోజు రోజుకు ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా సహా ఇతర దేశాల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 90 లక్షలు దాటింది.
- మొత్తం కేసులు: 19,006,975
- మరణాలు: 711,888
- కోలుకున్నవారు: 12,193,584
- యాక్టివ్ కేసులు: 6,101,503
అమెరికాలో..
కరోనా కేసులు, మరణాల్లో తొలిస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవటం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 50 లక్షలకు చేరువయ్యాయి. 1.61 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది వరకు వైరస్ నుంచి కోలుకోవటం ఊరట కలిగించే విషయం.
బ్రెజిల్లో..
బ్రెజిల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే, కేసులు, మరణాల్లో రెండోస్థానంలో ఉంది. రోజు రోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతుండటం ఆక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 28.62 లక్షలు దాటింది. 97 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
పిలిప్పీన్స్‌లో ..
కరోనా మహమ్మారి విజృంభణతో పిలిప్పీన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా మరో 3,561 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య ఇండోనేషియాను వెనక్కి నెట్టి దక్షిణాసియాలోనే అత్యధిక కేసుల ఉన్న దేశంగా అవతరించింది. తాజా గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 1,19, 460కి చేరింది. 2,150 మంది మరణించారు. ఇండోనేషియాలో 1,18,753 కేసులు ఉన్నాయి. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో 16.5 శాతం క్షీణించింది.
నేపాల్‌లో మళ్లీ ఆంక్షలు..
కొత్త కేసుల పెరుగుదలతో రాజధాని కాఠ్‌మాండూతో పాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో తిరిగి ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది నేపాల్ ప్రభుత్వం.
బుధవారం దేశవ్యాప్తంగా 380 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 21,390కి చేరింది. ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
వియాత్నంలో విజృంభణ..
కరోనా మహమ్మారి వియాత్నంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 10 రోజుల్లో వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది ఆ దేశ ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 747 కేసులు నమోదుకాగా.. 10 మంది మరణించారు. 392 మంది కోలుకున్నారు.
పాక్‌లో 727 కొత్త కేసులు..
పాకిస్థాన్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 727 మంది వైరస్‌బారిన పడ్డారు. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2.81లక్షలు దాటింది. 6,035 మంది వైరస్ కాటుకు బలయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు..
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 4,974,024 | 161,620 |
బ్రెజిల్ | 2,862,761 | 97,418 |
రష్యా | 871,894 | 14,606 |
దక్షిణాఫ్రికా | 529,877 | 9,298 |
మెక్సికో | 456,100 | 49,698 |
పెరు | 447,624 | 20,228 |
చిలీ | 364,723 | 9,792 |
స్పెయిన్ | 352,847 | 28,49 |