మహమ్మారి కొవిడ్‌ను అంతం చేసేందుకు సమీప భవిష్యత్‌లో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. అయితే అతిశీతల ప్రదేశంలో టీకాను నిల్వ చేయాలన్నది ప్రపంచదేశాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించి, టీకాను నిల్వ చేయడానికి సిద్ధమవుతున్నాయి జర్మనీ, అమెరికా దేశాలు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు, నిర్ణీత ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫ్రిజ్‌లను తయారు చేస్తున్నాయి.
అమెరికా రెడీ
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది అమెరికా. ఈ మేరకు లాస్ఏంజలస్లోని సెడార్స్-సినాయ్ అనే ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడ అతిశీతల ఉష్ణోగ్రత వద్ద టీకాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉండటమే ఇందుకు కారణం.
జర్మనీ సిద్ధం..
అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లను రవాణా చేయడానికి అవసరమైన ప్రత్యేకమైన రిఫ్రిజరేటెడ్ కంటైనర్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది శీతలీకరణ పరికరాలను తయారుచేసే జర్మనీకి చెందిన బైండర్ సంస్థ. మైనస్ 80.6 డిగ్రీల అతిశీతల ఉష్ణోగ్రత సామర్థ్యం గల ఫ్రిజ్‌లను తయారు చేస్తోంది.
ఫైజర్, మోడెర్నా సంస్థలు అభివృద్ధి చేస్తోన్న టీకాను మైనస్ 70 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి రావడం వల్ల.. వ్యాక్సిన్ నిల్వ అతిపెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ఓ అడుగు ముందుకేశాయి.
ఇదీ చూడండి: క్రిస్మస్ కోసం బ్రిటన్‌లో ఆంక్షల సడలింపు