పోలీసు కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నివాళిగా మిన్నియాపొలిస్ రాష్ట్రంలో సంతాప సభ నిర్వహించారు. ఫ్లాయిడ్ బంగారు శవపేటిక ముందు ప్రజలు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఫ్లాయిడ్ సోదరుడు టెరెన్స్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోనూ స్మారక సభ నిర్వహించారు. నగర మేయర్ బిల్ డి బ్లాసియో సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని ప్రజలను కోరాడు టెరెన్స్.
ప్రజల సందర్శనార్థం..
ఫ్లాయిడ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హ్యూస్టన్‌లో సోమవారం అందుబాటులో ఉంచనున్ననట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ సహా పలువురు డెమోక్రాటిక్ నేతలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. అనంతరం ఫ్లాయిడ్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కొనసాగిన నిరసనలు
మరోవైపు జ్యాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శన చేసిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 60 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
విదేశాల్లోనూ ఫ్లాయిడ్ ఉదంతానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆస్ట్రియాలోనూ జాతి విద్వేషం తీవ్రస్థాయిలో ఉందంటూ నిరసనకారులు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బ్రిటన్‌లోనూ ఫ్లాయిడ్ నిరసనలు కొనసాగాయి. భౌతిక దూరం పాటించకుండా ఆందోళనలో పాల్గొనడం వల్ల ఓ దశలో పోలీసులతో ఘర్షణ వాతావరణం తలెత్తింది.
హక్కులను గౌరవించండి: రష్యా
ప్రజలకు ఉన్న శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని అమెరికాకు రష్యా సూచించింది. లూటీలు, ఇతర నేరాలపై చర్యలు తీసుకుంటున్నామన్న నెపంతో అమెరికన్ల హక్కులకు విఘాతం కలిగించరాదని పేర్కొంది. ఇతర దేశాల్లో ప్రజల అణచివేతలపై దృష్టిసారించే ముందు సొంత దేశ పౌరుల హక్కులను కాపాడాలని అమెరికాకు హితవు పలికింది.
భయానకం: మెర్కెల్
ఫ్లాయిడ్ మృతిపై జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మెర్కెల్ స్పందించారు. ఈ సంఘటన అత్యంత భయంకరమైనదని వ్యాఖ్యానించారు. ఘటన జాత్యహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమెరికా సమాజంలో విభజనలు మరింత తీవ్రతరం కావని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దే శక్తి అమెరికా ప్రజాస్వామ్యానికి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బెయిల్ మంజూరు
ఫ్లాయిడ్ హత్యకు సహకరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులకు.. కోర్టు బెయిలు మంజూరు చేసింది. 7.5 లక్షల డాలర్ల చొప్పున పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ భారీ సాయం