అఫ్గానిస్థాన్‌లో అమెరికా మిషన్ ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. అఫ్గాన్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై ఆ దేశ ప్రభుత్వానికి సలహాలు అందించడం సహా భద్రత బలగాలకు నిధులు మంజూరు చేయడం కొనసాగిస్తామని తెలిపారు. తీవ్రవాద సంస్థలు పుట్టుకురాకుండా కట్టడి చేయడంలో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో అగ్రరాజ్య టాప్ కమాండర్ జనరల్ స్కాట్ మిల్లర్ స్వదేశానికి చేరుకున్న నేపథ్యంలో లాయిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇన్నేళ్లు మాకు అఫ్గాన్‌లో సహకారం అందించిన స్థానికులు, వారి కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. 20 ఏళ్లుగా వారు ఎన్నో త్యాగాలు చేశారు."
-లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి
ఇదే అవకాశం..
తాలిబన్లను కట్టడి చేయడంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అఫ్గాన్లకు ఇది మంచి అవకాశం అన్నారు లాయిడ్. తమ దేశంలోని శాంతి భద్రతలను కాపాడుకునే సామర్థ్యం అఫ్గాన్ బలగాలకు ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు వారి నైపుణ్యానికి, ధైర్యానికి సవాల్‌గా మారాయని పేర్కొన్నారు.
ఆగస్టు నెలాఖరుకు అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి అవుతుందని లాయిడ్ వెల్లడించారు.
ఇదీ చదవండి : తాలిబన్ల ఆధీనంలోకి అఫ్గాన్ సరిహద్దు కీలక ప్రాంతం