కరోనా మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు తామంతా ఓ 'యునైటెడ్ ఫ్రంట్'గా ఏర్పడాలని జీ-20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి 5 ట్రిలియన్ డాలర్లకు పైగా అందిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
"కరోనా వల్ల సామాజికంగా, ఆర్థికంగా ఏర్పడుతున్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్లకు పైగా చొప్పించాం."
- జీ-20 స్టేట్మెంట్
కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న వేళ జీ-20 దేశాధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనిచ్చేందుకు, బలమైన ఆర్థిక ప్యాకేజీని అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రాంతీయ బ్యాంకుల వంటి బహుపాక్షిక సంస్థలతో కలిసి పనిచేస్తామని జీ-20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.
ఆర్థిక లక్ష్యాల కంటే మనుషులే ముఖ్యం
ఈ విపత్కర సమయంలో ఆర్థిక లక్ష్యాల కంటే ప్రజల శ్రేయస్సే ప్రధానంగా పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం అన్ని దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, మానవజాతి అభివృద్ధి కోసం వైద్య పరిశోధనల్లో అన్ని దేశాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మానవ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయాలని, కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్ల ఉత్పత్తికి కృషి చేయాలని మోదీ స్పష్టం చేశారు. అలాగే పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాడలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా