భారతీయ అమెరికన్లకు మొదటినుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి తన ప్రభుత్వంలో చోటుకల్పించారు. తాజాగా ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్ సహా పసిఫిక్ దీవులకు (ఏఏఎన్‌హెచ్‌పీఐ) చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిషన్‌లో నలుగురు ఇండో అమెరికన్లను నియమించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం సోమవారం వెల్లడించింది. 23 మంది సభ్యులుగల అడ్వైజరీ కమిషన్‌లో భారతీయ అమెరికన్లు అయిన అజయ్ భుటోరియా, సోనాల్ షా, కమల్ కాల్సి, స్మితా షాలకు చోటు కల్పిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో పేర్కొంది.
- సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అజయ్ భుటోరియా ఏషియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ కోసం కృషి చేశారు.
- డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్ షా విద్యారంగంలో విశేష కృషి చేశారు.
- డాక్టర్ కమల్ సింగ్ కాల్సి అమెరికా సైన్యానికి 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. అఫ్గానిస్థాన్‌లో ఆయన అందించిన సేవలకుగాను ప్రభుత్వం బ్రాన్జ్ స్టార్ మెడల్‌ను ఇచ్చి ఆయనను గౌరవించింది.
- ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్ షా.. షికాగోకు చెందిన స్పాన్ టెక్కు సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ కమిషన్.. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్, పసిఫిక్ దీవులకు చెందిన వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై బైడెన్‌కు సూచనలను అందిస్తుంది. అంతేకాదు, ఆసియన్లు ఎదుర్కొంటున్న విద్వేషం, హింసను కట్టడి చేయడంపై కూడా అధ్యక్షుడికి సూచనలు చేస్తుంది.
ఇదీ చూడండి : 'కమాండర్'కు స్వాగతం పలికిన జో బైడెన్ కుటుంబం