అమెరికా నిఘా విభాగం(సీఐఏ) మాజీ డైరెక్టర్ పెట్రియాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ సమాచారాన్ని.. సీఐఏకు పాకిస్థాన్ నిఘా విభాగం(ఐఎస్ఐ) అందించిందన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. ఒసామా ఎక్కడ తలదాచుకున్నాడో ఐఎస్ఐకి తెలియదని పేర్కొన్నారు పెట్రియాస్. ఇవి ఇమ్రాన్ ప్రకటనలకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం.
ఐఎస్ఐ సహకారంతోనే అమెరికా నిఘా విభాగం ప్రత్యేక ఆపరేషన్‌లో లాడెన్‌ను మట్టుబెట్టిందని ఫాక్స్ న్యూస్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇమ్రాన్. అమెరికా నేవీ సీల్స్ పాకిస్థాన్ అబోటాబాద్‌లో తలదాచుకున్న.. ఒసామాను 2011లో కాల్చిచంపింది. అయితే.. అప్పటివరకు లాడెన్ పాక్‌లో ఉన్న విషయం తమకు తెలియదని చెబుతూ వచ్చింది దాయాది దేశం.
పాక్‌పై నమ్మకముంది..!
అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండో-పసిఫిక్ అంశంపై మాట్లాడారు పెట్రియాస్. తీవ్రవాద నాయకుడు ఒసామా తమ దేశంలో దాక్కున్నట్లు పాక్ నిఘా విభాగానికి తెలియదని అమెరికా నమ్ముతున్నట్లు తెలిపారు.
''పాకిస్థాన్ నిఘా విభాగం(ఐఎస్ఐ)కు గానీ, ఇతరులకు గానీ.. ఒసామా పాక్‌లో ఉన్నట్లు తెలియదని మాకు నమ్మకముంది. వారెవరూ అతడిని దాచలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. మాకు లాడెన్ అంశంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఒసామాను అబోటాబాద్‌లోని ఓ ప్రదేశంలో ఉండేందుకు పాకిస్థానీయులు అనుమతించారన్న వారి వ్యాఖ్యల్ని పూర్తిగా విభేదిస్తున్నాం.''
- పెట్రియాస్, సీఐఏ మాజీ డైరెక్టర్
పాక్ ప్రధానిపై చివర్లో సానుకూల వ్యాఖ్యలు చేశారు పెట్రియాస్. ఇమ్రాన్‌ఖాన్.. తమ దేశంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. అధిగమించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పాక్‌లో 40వేల మంది ఉగ్రవాదులు: ఇమ్రాన్