అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా సోకిన తొలి పెంపుడు కుక్క బడ్డీ ఇక లేదు. న్యూయార్క్ కు చెందిన రాబర్ట్, అలిసన్ మహోనీల గారాల కుక్క బడ్డీకి మే నెలలో కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. యజమాని రాబర్ట్‌కి కరోనా సోకిన తర్వాత ఏప్రిల్‌లో బడ్డీ శ్వాసలో మార్పు వచ్చింది. పరీక్షించిన పశువైద్యులు బడ్డీని.. అమెరికాలో కరోనా సోకిన తొలి పెంపుడు కుక్కగా గుర్తించారు.
జర్మన్ షెఫెర్డ్ జాతికి చెందిన ఆ శునకం.. కొద్ది రోజులుగా రోగ నిరోధక శక్తి వ్యవస్థకు సోకిన లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. కరోనా బారినపడిన తర్వాత మృతి చెందింది. అయితే, శునకం మృతికి కరోనా కారణమైందా లేదా అనే కోణంలో పరిశోధనలు చేయాలని స్థానిక ఆరోగ్య శాఖ ఆదేశించింది. శవ పరీక్షల మేరకు బడ్డీ మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించాలని కోరింది. కానీ అప్పటికే శునకం అంత్యక్రియలు పూర్తయిపోయాయి.
అధికారికంగా అమెరికా వ్యాప్తంగా 12 పెంపుడు కుక్కలు, 10 పిల్లులు, ఓ పులి, మరో సింహానికి కరోనా సోకింది. అయితే, మనుషుల నుంచి జంతువులకు సోకినంత వేగంగా జంతువుల నుంచి మానవులకు వైరస్ సోకుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: 12 ఆసుపత్రులు తిరిగినా బాలింత ప్రాణం దక్కలే!