అమెరికా ప్రభుత్వం డిసెంబర్ ఆరంభంలోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు శ్వేతసౌధం వ్యాక్సిన్ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్.. అత్యవసర వినియోగం కోసం.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ ఆమోదంపై చర్చించేందుకు ఎఫ్‌డీఏ అడ్వైజరీ కమిటీ డిసెంబర్ 10న సమావేశం కానుంది.
ఒక్కసారి ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే.. మరుసటి రోజే టీకాల పంపిణీ ప్రారంభించాలనే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు అమెరికా కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ హెడ్ డా. మాన్సెఫ్ స్లావీ. వచ్చే ఏడాది మే లోగా అమెరికా జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొన్నారు.
''ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన 24 గంటల్లోగా వ్యాక్సిన్లను ఇమ్యునైజేషన్ సైట్లకు పంపాలని చూస్తున్నాం. ఇదే జరిగితే డిసెంబర్ 11-12 మధ్య టీకాలు అక్కడికి చేరుకుంటాయి.''
- డా. మాన్సెఫ్ స్లావీ, యూఎస్ కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ హెడ్
ఫైజర్ అభివృద్ధి చేసిన క్యాండిడేట్ వ్యాక్సిన్ .. రెండు డోసులుగా ఇస్తారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అనంతరం.. తమ వ్యాక్సిన్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ ఫార్మా సంస్థ.. ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది చివర్లోగా 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి: గుడ్‌న్యూస్: ఫైజర్ టీకా 95 శాతానికిపైగా ప్రభావవంతం
మోడెర్నా కూడా..
అమెరికాలోనే మరో సంస్థ.. మోడెర్నా కూడా వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను అభివృద్ధి చేస్తోంది. రాబోయే వారాల్లో ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందుతుందని భావిస్తోంది. మోడెర్నా టీకా కూడా.. 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది.
ఇదీ చూడండి: మోడెర్నా టీకా పనితీరు అద్భుతం: ఫౌచీ
అమెరికాలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం దేశంలో 12 మిలియన్లకుపైగా కరోనా సోకింది. మరో 2 లక్షల 55 వేల మంది మరణించారు.