మోడెర్నా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ క్యాండిడేట్ mRNA-1273 అత్యవసర వినియోగానికి అతిత్వరలోనే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు ఇవ్వనుంది. ఈ మేరకు నిపుణులతో కూడిన ఎఫ్‌డీఏ సలహా కమిటీ.. టీకా ఆమోదం కోసం సిఫార్సు చేసింది. ఎఫ్‌డీఏ- వ్యాక్సిన్లు, జీవఉత్పత్తుల సలహా కమిటీ సభ్యుల్లో 20-0 ఓట్లతో టీకాకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అతి త్వరలోనే తుది అనుమతులు ఇచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఆహార, నియంత్రణ సంస్థ కమిషనర్ స్టీఫెన్ హాన్ తెలిపారు.
ఎఫ్‌డీఏ అనుమతులు లభిస్తే.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభిస్తామని మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బన్సల్ స్పష్టం చేశారు.
టీకా ప్రభావవంతం..
ఇప్పటికే మోడెర్నా క్లినికల్ ట్రయల్స్‌లో సురక్షితమైంది, సమర్థమైందని తేలింది. నవంబర్ 30న ప్రకటించిన ఫలితాల్లో.. టీకా 94.1 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని మోడెర్నా స్పష్టం చేసింది. ప్రతికూల ప్రభావం లేదని నిర్ధరించింది.
ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా.. మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సాధారణ ఫ్రిజ్లలోనూ స్టోర్ చేయొచ్చు.
ఫైజర్ తర్వాత..
ఇప్పటికే అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ తయారుచేసిన టీకా వినియోగానికి అనుమతి లభించింది. వ్యాక్సిన్ పంపిణీ కూడా ముమ్మరంగా సాగుతోంది.
ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల 10 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ బాధితులు పెరుగుతుండటం పట్ల ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరలో సాధారణ ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఇవీ చూడండి: