జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ(ఎఫ్బీఐ) హెచ్చరించింది. అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానుల్లో, వాషింగ్టన్ డీసీలో నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించినట్లు తెలిపింది.
"అమెరికాలోని పలు ప్రాంతాల్లో జనవరి 16-20 వరకు నిరసనకారులు ఆయుధాలతో అల్లర్లకు దిగేందుకు యోచిస్తున్నారు. జనవరి 17 నుంచి 20 వరకు క్యాపిటల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం." అని ఫెడరల్ బ్యూరో పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. క్యాపిటల్ హిల్ భవనం వద్ద అమెరికా అధ్యక్షుడిగా నిర్భయంగా ప్రమాణ స్వీకారం చేస్తానని బైడెన్ తెలిపారు. జనవరి 20న 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి:ట్రంప్ ఎఫెక్ట్: సోషల్ మీడియా సంస్థలు నష్టాల్లోకి..