అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు షాకిచ్చాయి. ట్రంప్ టీమ్ కరోనా వైరస్‌కు సంబంధించి పోస్ట్ చేసిన ఓ వీడియో తప్పుదోవ పట్టించే విధంగా ఉందనే కారణాలతో ఆ పోస్ట్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ చేశాయి.
వీడియోలో ఏముందంటే..
ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చిన్నపిల్లలు దాదాపుగా కరోనా వైరస్ నుంచి తట్టుకొనే రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను ట్రంప్ టీమ్ అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేయగా.. ఆ వ్యాఖ్యలు నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయంటూ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
"ఆ వీడియోలో ఒక ప్రత్యేక వయస్సుకు చెందిన వారు కొవిడ్-19 రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనే సమాచారం ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తోంది. మా సంస్థ నిబంధనలకు ఇది విరుద్ధం" అని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. ట్విట్టర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ సంస్థల చర్యను ట్రంప్ ప్రతినిధి కర్టనీ పారెల్లా విమర్శించారు. ట్రంప్ మాట్లాడింది వాస్తవమని, సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయనిర్ణేతలు కారని మండిపడ్డారు. అధ్యక్షుడి పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయని నిందించారు.
డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విశ్లేషణ ప్రకారం.. ఫిబ్రవరి 24 నుంచి జులై 12 మధ్య వైరస్ బారిన పడిన 60లక్షల మందిలో 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు వారు 4.6 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. "గణాంకాలను పరిశీలిస్తే.. ఒక ప్రత్యేక వయస్సుకు చెందిన చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు వైరస్‌ను బాగా తట్టుకోగలరని అనిపిస్తుంది" అని వ్యాఖ్యానించారు.