అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చారిత్రక రెండో అభిశంసన ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. యూఎస్ క్యాపిటల్ భవనంపై జనవరి 6న జరిగిన దాడిలో ఆయనను దోషిగా నిర్ధరించాలా లేదా అనేది తేలనుంది. అయితే ఈ ప్రక్రియ ఎలా జరగుతుంది? ఎన్ని రోజులు పడతుందో తెలుసుకుందాం.
ఆమోదం కష్టమే..
సెనేట్‌లో డెమొక్రాట్లకు 50, ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లకు 50 స్థానాలు ఉన్నాయి. ట్రంప్‌ను దోషిగా తేల్చాలంటే మూడింట రెండో వంతు సభ్యులు (67 మంది సెనేటర్లు) అభిశంసన ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంటుంది. అందువల్ల ట్రంప్ నిరపరాధిగా బయటపడే అవకాశమే ఎక్కువ. అయితే హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, ప్రతినిధులు భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడటం లాంటివి వివరించి రిపబ్లికన్ల మద్దతు కూడగట్టాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కానందున అభిశంసన ప్రక్రియ చేపట్టరాదన్నది ఆయన తరఫు న్యాయవాదాల వాదన. తన ఓటమికి వ్యతిరేకంగా పోరాడమని మద్దతుదారులకు పిలుపునివ్వడం హింసను ప్రేరేపించడం కాదని అంటున్నారు.
విచారణ ఎలా జరుగుతుంది?
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభ అభిశంసన ప్రక్రియ చేపడుతుంది. అందులో ఆమోదం పొందిన తర్వాత అభియోగాలపై సెనేట్ విచారణ జరుపుతుంది. మూడింట రెండొంతుల ఆమోదం లభిస్తే ట్రంప్ దోషిగా తేలతారు.
విచారణ కోసం 9 మంది మేనేజర్లను సభ నియమించింది. వారు ట్రంప్ కేసును సెనేట్ ముందుంచుతారు. ట్రంప్ తరఫు న్యాయవాదులకు అభియోగాలకు వ్యతిరేకంగా వాదించేందుకు సమాన సమయమిస్తారు.
అధ్యక్షుడిపై విచారణకు సాధారణంగా అమెరికా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కానీ పదవి నుంచి ట్రంప్ వైదొలిగినందున అధికార పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీలో అత్యంత సీనియర్ సభ్యుడైన పాట్రిక్ లీహీ నేతృత్వం వహిస్తారు.
విచారణలో ట్రంప్ తప్పు చేశారని సెనేటర్లు భావిస్తే ఓటింగ్ నిర్వహిస్తారు. సభ్యులు నిలబడి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు.
విచారణ ఎన్ని రోజులు జరుగుతుంది?
బుధవారం నుంచి వాది, ప్రతివాదుల మధ్య వాదనలు ప్రారంభమవుతాయి. ఒక్కో పక్షానికి 16 గంటలు సమయం ఇస్తారు. ఆ తర్వాత సెనేటర్లు పశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో కొన్ని సార్లు విధానపరమైన ఓటింగ్ జరిగే అవకాశముంది. ఈ ప్రక్రియ మొత్తం వారం కన్నా ఎక్కువ రోజులు జరగొచ్చు.
అయితే ఒప్పందం ప్రకారం మంగళవారం తొలుత.. అసలు విచారణ రాజ్యాంగ బద్ధమేనా? కాదా? అని చర్చ జరగనుంది. ఆ తర్వాత అభియోగాలు కొట్టివేసే అంశంపై ఓటింగ్ జరగుతుంది. ఆ తర్వాతే బుధవారం నుంచి వాదనలు మొదలవుతాయి.
వాదనలను ట్రంప్ తరఫు న్యాయవాదులు శుక్రవారం మొదలుపెట్టి శనివారానికల్లా ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కాబట్టి వచ్చే వారానికి గానీ ఈ ప్రక్రియ ముగిసిపోదు.
ట్రంప్‌పై తొలి అభిశంసన ప్రక్రియ మూడు వారాల పాటు జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం విచారణ అంతకన్నా ముందుగానే పూర్తవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే కేసు సంక్లిష్టమైనది కాదు. పైగా దాడికి సంబంధించిన చాలా వివరాలు సెనేటర్లకు తెలుసు.
సెనేట్‌కు ఎక్కువ సమయం ఇవ్వకుండా కేసు విచారణ త్వరగా పూర్తి కావాలని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. ఎందుకంటే విచారణ ముగిసే వరకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కేబినెట్‌ను సెనేట్ ఆమోదించడానికి వీలులేదు.
విచారణలో సాక్షులుంటారా?
ప్రస్తుతానికైతే సాక్షులుండే అవకాశం లేదు. అయితే విచారణ ముందుకెళ్లే కొద్దీ.. అందుకు వీలుండొచ్చు. అభిశంసన మేనేజర్లకు వాంగ్మూలం ఇవ్వడానికి స్వయంగా ట్రంప్ నిరాకరించడం గమనార్హం.
గత అభిశంసన విచారణలో సాక్షుల కోసం డెమొక్రాట్లు పట్టుబట్టారు. అయితే ఈ సారి టీవీల్లో దాడికి సంబంధించిన వీడియోలు ప్రసారం అయినందున ప్రత్యేక సాక్షుల అవసరం లేదని వారు భావిస్తున్నారు. పైగా సెనేటర్లే ఆ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షులు.
అయితే సాక్షులను పిలవాలా లేదా అనేదానిపై ఓటింగ్ జరుగుతుంది. విచారణకు సాక్షులను అనుమతించాలంటే సెనేట్ అనుమతి తప్పనిసరి.
అధ్యక్షుడిగా తప్పుకున్నా.. ట్రంప్‌పై విచారణ ఎందుకు?
'అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ కాలం పూర్తయింది. మరోసారి ఆయనను పదవి నుంచి తొలగించడం కష్టం. కాబట్టి విచారణ అనవసరం, పైగా రాజ్యాంగ విరుద్ధం.' అని రిపబ్లికన్లు, ట్రంప్ లాయర్లు వాదిస్తున్నారు. అయితే దీనిని డెమొక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. 1876లో అప్పటి యుద్ధ శాఖ మంత్రి విలియం బెల్నాప్పై అభిశంసనను ప్రస్తావించారు. అయితే ఆ ప్రక్రియకు ముందే ఆయన పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆయనపై పూర్తి విచారణ జరిగింది. అందులో ఆయన నిర్దోషిగా తేలారు.
ఒకవేళ ట్రంప్ దోషిగా తేలితే.. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టకుండా ఉండేందుకు సెనేట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది. అదే ఆయనకు సరైన శిక్ష అని డెమొక్రటిక్ నేత షుమాకర్ అభిప్రాయపడ్డారు.
అధికారంలో లేరనే కారణంగా నేరాలకు పాల్పడిన అధ్యక్షులపై చర్యలు తీసుకోరాదనే వాదన సరికాదని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్‌ను దాడికి బాధ్యత వహించేలా చేయడానికి ఈ ప్రక్రియ అవసరమన్నది వారి మాట.
"న్యాయం జరిగేంత వరకు ముందుకు వెళ్లరాదు" అని గతవారం సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. ఈ విచారణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లక పోతే ఇక రాజ్యాంగం నుంచి 'అభిశంసన' శిక్షను తొలగించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: బైడెన్‌కు మోదీ ఫోన్.. ప్రాంతీయ సమస్యలపై చర్చ