చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందనే వాదనలు తీవ్రమవుతున్న కొద్దీ అమెరికా అంటువ్యాదుల చికిత్స నిపుణులు ఆంటోని ఫౌచీపై విమర్శలు అధికమవుతున్నాయి. ఇటీవల ఫౌచీ ఈమెయిల్స్.. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కింద బహిర్గతం అయ్యాయి. ఇందులో కొన్ని ఈమెయిల్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాస్కులపై ఆయన స్పందన, వుహాన్ ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని కొట్టిపారేయటం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి నాళ్లలో ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మాట మార్చారు. ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.
కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డాక్టర్ ఫౌచీకి.. ఇమ్యూనాలజిస్టు క్రిస్టియన్ జీ అండర్సన్ ఒక ఈమెయిల్ పంపించారు. దానిలో "వైరస్‌కు ఉన్న అసాధారణ ఫీచర్లు చూస్తేంటే దీనిని ల్యాబ్ సెట్టింగ్స్‌లో మార్చారేమో అనిపిస్తోంది" అని పేర్కొన్నారు. కానీ తర్వాత ఆయనే ల్యాబ్ లీక్ సిద్ధాంతానికి ఆధారాల్లేవు అని పత్రాన్ని సమర్పించారు. మరోపక్క డాక్టర్ ఫౌచీ ఈ వైరస్ ప్రకృతి సహజంగానే జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించిందనే వాదనలను ప్రచారం చేశారు. శాస్త్రవేత్తలను కూడా ఈ దిశగా రాయమని ఆయన సలహా కూడా ఇచ్చారు. వాస్తవానికి ఏ జంతువు నుంచి వచ్చిందో ఇప్పటికీ తెలియదు. కానీ, తాజాగా మాత్రం ఆయన కూడా ల్యాబ్ లీక్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన నుంచి మెయిల్..
ఇక 2014-19 వరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ హెల్త్ నుంచి ఎకోహెల్త్ అలయన్స్‌కు.. అక్కడి నుంచి వుహాన్ ల్యాబ్‌కు 3.4 మిలియన్ డాలర్లు వెళ్లాయి. ఆ సంస్థకు వుహాన్ ల్యాబ్‌తో సంబంధాలు ఉన్నాయి. దీని యజమాని పేరు పీటర్ డెస్జోక్. అతను 2020 ఏప్రిల్ 20వ తేదీ ఫౌచీకి ఒక మెయిల్ పంపించారు. దీనిలో "మా మిత్రులు , భాగస్వాముల తరపున మీరు నిలబడినందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతున్నాను. వైరస్ పుట్టుక సహజమైనదే అన్న వాదనకు మీ మద్దతుతో శాస్త్రపరంగా బలం చేకూరింది. మీ వ్యాఖ్యలు ధైర్యంగా ఉన్నాయి. విశ్వసనీయమైన మీ నుంచి వచ్చే మాటలు వైరస్ పుట్టుకపై అనుమానాలను దూరం చేస్తాయి" అని పేర్కొన్నారు.
హామీ ఇవ్వలేనని...
ఫిబ్రవరి 2020లో డాక్టర్ ఫౌచీ తన సహాయకుడు హ్యూజ్ ఔచిన్‌క్లోస్‌కు ఒక మెయిల్ పంపారు. దీనిలో కరోనా వైరస్‌లపై చేసిన గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పరిశోధన పత్రం ఉంది. దీనిని చదవాలని హ్యూజ్‌ను ఫౌచీ ఆదేశించారు. దీనికి అతను స్పందిస్తూ.. "విదేశాల్లో జరిగిన ఈ పరిశోధనకు మనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకుంటాను" అని పేర్కొన్నారు. ఎన్‌ఐహెచ్ నిధులను కరోనా వైరస్‌లపై పరిశోధనలకు వెచ్చించారు. ఆ నిధులతో వుహాన్ ల్యాబ్‌లో ఈ వైరస్‌లను మరింత ప్రమాదకరంగా , వేగంగా వ్యాపించేలా మార్చి ఉండవచ్చు. దీనిపై బుధవారం 'న్యూస్ నేషన్ నౌ' కార్యక్రమంలో ఫౌచీ స్పందించారు. తాము నమూనాల సేకరణకు మాత్రమే ఎకో హెల్త్ ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చామని వెల్లడించారు. కానీ, వుహాన్ ల్యాబ్‌లో అన్నీ మేము అనుకున్నట్లే అవుతాయని హామీ ఇవ్వలేనని తెలిపారు. తన ఈమెయిల్స్‌ను తప్పుగా అన్వయించుకొంటున్నారని పేర్కొన్నారు. కరోనాపై దర్యాప్తు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వాల్‌స్ట్రీట్ తన ఎడిట్‌లో కోరింది.
''వుహాన్' వైద్య నివేదికలు విడుదల చేయండి'
కరోనా వ్యాప్తికి ముందు కొద్ది రోజుల ముందు వుహాన్ ల్యాబ్‌లో అనారోగ్యానికి గురైన ముగ్గురు సిబ్బంది వైద్య నివేదికలు విడుదల చేయాలని పౌచీ కోరారు. "2019లో అక్కడ జబ్బుపడిన వారి వైద్య నివేదికలను నేను చూడాలనుకుంటున్నాను. వారు నిజంగానే జబ్బుపడ్డారా..? అలా అయితే వారు ఏ కారణంతో అనారోగ్యానికి గురయ్యారు" అని ఆయన పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
'ఆధారాలు మాయం చేసి ఉంటారు'
వుహాన్ ల్యాబ్‌లో ఆధారాలను చైనా అధికారులు ఇప్పటికే ధ్వంసం చేసి ఉంటారని బ్రిటిష్ నిఘా సంస్థ ఎంఐ6 మాజీ డైరెక్టర్ సర్ రిచర్డ్ డియర్లోవ్ పేర్కొన్నారు. "వుహాన్ ల్యాబ్‌లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ పరిశోధనలు చేస్తున్నారని నిరూపించడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పటికే చాలా డేటాను ధ్వంసం చేయడం కానీ, మాయం చేయడం కానీ చేసి ఉంటారు. అక్కడ మహమ్మారి పుట్టుకకు కారణమైన పరిశోధనలు చేశారని నిరూపించలేము" అని పేర్కొన్నట్లు ది ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.
ఇవీ చూడండి: