అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఓటర్లను ఆకర్షించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. పోల్ సర్వేలను పరిశీలిస్తే ఇద్దరి మధ్య చావో రేవో అన్న స్థాయిలో పోటీ నెలకొంది.
ఇప్పటికే ముందస్తు ఓటింగ్ నడుస్తోన్న నేపథ్యంలో 9.2 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినప్పటికీ అందరి దృష్టి నవంబర్ 3పైనే ఉంది. అయితే, కీలక రాష్ట్రాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవటంలో ట్రంప్, బైడెన్ ఎలాంటి పురోగతి సాధించలేదని విశ్లేషకులు అంటున్నారు.
ట్రంప్‌కు కీలకం..
కఠినమైన పోటీ నెలకొన్న వేళ కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంపై ట్రంప్ దృష్టి సారించారు. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవటం ముఖ్యం. శనివారం మొత్తం ఆ రాష్ట్రంలో నాలుగు సభల్లో పాల్గొన్నారు.
సర్వేలు ఇలా..
కానీ, రియల్ క్లియర్ పాలిటిక్స్ నిర్వహించిన సర్వేలో.. పెన్సిల్వేనియాలో బైడెన్ కన్నా 4 పాయింట్లు ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు తేలింది. కీలక రాష్ట్రాలన్నింటిలో కలిపి 3.7 పాయింట్లు బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు.
న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సర్వే కూడా బైడెన్ ముందంజలో ఉన్నట్లు స్పష్టం చేసింది. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అరిజోనాల్లో బైడెన్‌కు 52 శాతం ఓటర్లు మద్దతు తెలపగా.. ట్రంప్‌కు 41 శాతం అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: సర్వేల్లో బైడెన్ జోరు- ట్రంప్‌పై 8 పాయింట్ల ఆధిక్యం