తమ రిసార్ట్‌కు సంబంధించిన 11,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తున్నట్లు 'వాల్ట్ డిస్నీ వరల్డ్' తెలిపింది. ఈ మేరకు.. అమెరికాలోని ఫ్లోరిడా ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు లేఖ రాసింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఏడాది చివరికల్లా ఈ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది డిస్నీ వరల్డ్. ఒకవేళ డిస్నీ ఈ చర్యను అమలు చేస్తే.. ఫ్లోరిడాలోని తమ రిసార్ట్‌లో కరోనా కారణంగా తొలగించిన ఉద్యోగుల సంఖ్య 18,000కు చేరుతుంది.
720 మంది సింగర్లు, యాక్టర్ల తొలగింపు..
'కరోనా కారణంగా లైవ్ ఈవెంట్స్ చాలా రోజులు నిర్వహించలేదు. దీంతో, 720 మంది సింగర్లు, యాక్టర్లను డిస్నీ వరల్డ్ తొలగించింది' అని కార్మిక సంఘం యాక్టర్స్ ఈక్విటీ అసోసియేషన్ పేర్కొంది.
కాలిఫోర్నియా, ఫ్లోరిడా రిసార్ట్‌లలో కలిపి 28,000 మంది ఉద్యోగులను తొలగించాలని డిస్నీ కంపెనీ గత నెల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం ఉద్యోగస్తుల తొలగింపు చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: ట్రంప్ పైనే భారతీయ-అమెరికన్ ఓటర్ల విశ్వాసం!