మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌ల స్వప్నాలను సాకారం చేసే దిశగా ఓ ఫౌండేషన్ ఏర్పాటుతో సహా పలు ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అమెరికాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
గాంధీ-కింగ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు...
రాబోయే ఐదేళ్లలో ఈ కార్యక్రమాల కోసం సుమారు రూ.1050 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని అభ్యర్థించారు. ‘గాంధీ-కింగ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసి, దాని ద్వారా ఆరోగ్యం, కాలుష్యం, వాతావరణ మార్పులు, విద్య, మహిళా సాధికారత సాధనకు తమవంతు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందజేసేందుకు కృషి చేయాలన్నది బిల్లు ఉద్దేశం. ఇక, ‘గాంధీ-కింగ్’ మేధావులు పరస్పరం ఉభయదేశాల్లో నిర్వహించే వార్షిక విద్యా చర్చావేదికలలో పాల్గొనేందుకు ఉద్దేశించిన అంశాన్నీ ఈ బిల్లులో పొందుపరిచారు.
ఇదీ చూడండి: మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'