మానవాళి నుదుటన కరోనా రాస్తున్న మృత్యు శాసనానికి తెరపడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ దెబ్బకు మృత్యువాతపడ్డవారి సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 44 లక్షలు దాటింది. కోలుకున్నవారి సంఖ్య 16 లక్షలకుపైగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం.
మరోవైపు, జన సంచారంపై నిషేధాజ్ఞలను అమెరికాలోని పలు రాష్ట్రాలు సడలిస్తుండటంపై అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. తొందరపాటుతో ఆంక్షలను ఎత్తివేస్తే.. నియంత్రించలేని స్థాయిలో వైరస్ విజృంభించే ముప్పుందని, మరణాలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరించారు. ఆరోగ్యం, విద్య, కార్మిక వ్యవహారాలు, పింఛన్లకు సంబంధించిన సెనేట్ కమిటీ ఎదుట ఫౌచీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మహమ్మారిని నిలువరించగల టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు- రిపబ్లికన్లకు ఎక్కువ పట్టున్న టెక్సాస్, టెన్నెస్సీ, అలబామా, కెంటకీ, ఉత్తర-దక్షిణ డకోటా వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ వెంటిలేటర్ల వినియోగాన్ని నిలిపివేసిన రష్యా
ప్రభుత్వరంగ రక్షణ సంస్థ 'రోస్టెక్' ఉత్పత్తి చేసిన ‘అవెంటా-ఎం’ వెంటిలేటర్ల వినియోగాన్ని నిలిపివేయాలని రష్యా నిర్ణయించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ రకం వెంటిలేటర్ మంగళవారం అగ్నిప్రమాదానికి గురవడంతో ఐదుగురు మరణించారు. రష్యాలో కొత్తగా 10 వేలమందికిపైగా వైరస్ సోకింది.
- ఆఫ్రికా ఖండంలోని బుల్లి దేశమైన లెసొథోలో తొలి కేసు నమోదైంది. దీంతో ఆఫ్రికాలోని మొత్తం 54 దేశాలకూ వైరస్ పాకినట్లయింది.
- 24 రోజుల విరామం తర్వాత హాంకాంగ్‌లో 66 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు(5) వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణాలేవీ చేయకున్నా, కొవిడ్ బాధితులను కలవకున్నా వారికి కరోనా సోకినట్టు పేర్కొన్నారు.
- థాయిలాండ్‌కు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా 24 గంటల వ్యవధిలో అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
- న్యూజిలాండ్‌లో వరుసగా రెండో రోజూ కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గురువారం నుంచి ఆ దేశంలో మాల్‌లు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి.
- స్పెయిన్‌లో కరోనా ఉద్ధృతి మళ్లీ స్వల్పంగా పెరిగింది. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో 184 మరణాలు, దాదాపు 400 కొత్త కేసులు నమోదయ్యాయి.
- బ్రెజిల్‌లో ఒక్కరోజులోనే 881 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12 వేలు దాటింది.
- చైనాలో తాజాగా 15 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. అందులో ఎనిమిది అసింప్టమాటిక్ కేసులు.
భారత సంతతి వైద్యురాలి మృతి
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యురాలు పూర్ణిమా నాయర్ (55) కొవిడ్ వ్యాధితో మృతి చెందారు. డర్హామ్ కౌంటీలోని స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్‌లో ఆమె జనరల్ ఫిజీషియన్. మార్చి రెండో వారంలో ఆమె వైరస్ బారిన పడగా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి ఇన్నాళ్లూ చికిత్స అందించారు.
2% మేర తగ్గిన బ్రిటన్ జీడీపీ
లాక్‌డౌన్ కారణంగా బ్రిటన్ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) జనవరి-మార్చి మధ్య కాలంలో 2 శాతం మేర తగ్గింది. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఇంత భారీగా జీడీపీ తగ్గడం ఇదే ప్రథమం. ఒక్క మార్చి నెలలోనే జీడీపీ 5.8 శాతం మేర పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ఆర్థిక ప్రగతి సున్నా శాతంగా నమోదయింది. ఏప్రిల్ నుంచి వరుసగా ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్నట్టుగా గుర్తిస్తారు. లాక్‌డౌన్ కారణంగా ప్రయివేటు ఉద్యోగులు సెలవులో ఉండాల్సి రావడంతో ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లిస్తోంది. ఇందుకోసం ప్రారంభించిన కరోనా వైరస్ ఉద్యోగ భద్రత పథకాన్ని అక్టోబర్ నెల వరకు పొడిగించనున్నట్టు ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రకటించారు.
ఇదీ చూడండి: భారత్, నేపాల్ మధ్య కయ్యానికి చైనా కుట్ర!