అమెరికా వాషింగ్టన్లో జరిగిన బహిరంగ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల క్రిస్టోఫర్ బ్రౌన్ అనే యువకుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డట్లు చెప్పారు.
స్థానికంగా పార్టీలో జరిగిన చిన్న గొడవ కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
"కనీసం ముగ్గురు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు కారణం స్పష్టంగా తెలియలేదు. గాయపడిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారిని ఆస్పత్రిలో చేర్చాం. ఆమె ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. మిగిలిన వారు దాదాపు సురక్షితమే."
-పీటర్ న్యూషామ్, పోలీస్ అధికారి
కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ పార్టీలో వందలాది మంది పాల్గొన్నట్లు న్యూషమ్ తెలిపారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో భీకరమైన కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో 50 మందికన్నా ఎక్కువ ప్రజలు గుమిగూడటం నిషేధమని వాషింగ్టన్ మేయర్ మురీల్ బౌసర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.