1400.. ఇది ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా మృతుల సంఖ్య. మే నెల అనంతరం ఈ స్థాయిలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. త్వరలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అగ్రరాజ్యంలో కరోనా 2.0 పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయని అధికారులు, వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 1,22,14,871కు చేరింది. అదే సమయంలో మృతుల సంఖ్య 2,59,754కు పెరిగింది. మరణాల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది అమెరికా. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య(80,000) కూడా రికార్డుస్థాయిలో ఉంది.
మృతదేహాల తరలింపు..
రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య నేపథ్యంలో ఆసుపత్రుల్లోని మార్చరీలు కిక్కిరిసిపోతున్నాయి. టెక్సాస్లోని ఎల్ పాసో కౌంటిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మృతదేహాల తరలింపు కోసం మనుషులు కావాలని అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. గంటకు 27 డాలర్లు చొప్పున ఉద్యోగంలో నియమించుకుంటున్నారు. మృతదేహాల తరలింపు కోసం ఈ కౌంటిలో ఇప్పటికే ఖైదీలను వాడుతున్నారు అధికారులు. వీరికి గంటకు 2 డాలర్లు ఇస్తున్నారు.
ముంచుకొస్తున్న విలయం!
అగ్రరాజ్యంలో ఇప్పుడు హాలీడే సీజన్. వచ్చే వారం "థాంక్స్ గివింగ్" జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భారీ సంఖ్యల్లో రోడ్లపైకి వచ్చే అవకాశముంది. ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తారు కూడా. వేడుకలు జరగడం.. అందులో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమూ లేకపోలేదు.
ఇదే జరిగితే పరిస్థితులు దారుణంగా మారుతాయని, ఊహకందని రీతిలో ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చర్యలు ఫలించేనా!
పెరుగుతున్న మృతుల సంఖ్య, హాలీడే సీజన్ తరుణంలో అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. కాలిఫోర్నియా శనివారం రాత్రి కర్ఫ్యూను అమలు చేసింది.
ఇదీ చూడండి:- కరోనాతో ఆమెకు ఊరట- ఉరిశిక్ష వాయిదా