క్యూబాలో మెకానికల్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన అడాల్ఫో రివేరా.. స్థానిక కలపతో దేశీయ విమానాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. గత 8 సంవత్సరాలుగా తన కలను సాకారం చేసుకోడానికి కృషిచేస్తున్న 70ఏళ్ల మెకానికల్ ఇంజినీర్‌కు ఆయన పిల్లలు విదేశాల నుంచి డబ్బు, వివిధ పరికరాలు పంపుతూ సహకరిస్తున్నారు.
అమితమైన ప్రేమ..
అంతంతమాత్రంగా ఉన్న క్యూబా ఆర్థిక వ్యవస్థకు తోడు.. దిగుమతులపై వివిధ ఆంక్షల వల్ల విమాన తయారీ పరికరాల దిగుమతి కష్టసాధ్యంగా ఉందని రివేరా వివరించాడు. స్టీల్ కేబుల్స్ సహా.. విమాన చక్రాలు దొరక్క ఇబ్బందిపడుతున్నానని చెప్పాడు. అయితే ఇవేవీ తన ప్రయత్నాలను ఆపలేవని 70ఏళ్ల రివేరా వివరించాడు. తన నివాసంలో ప్రొపెల్లర్ బిగించిన విమానాన్ని చూపిస్తున్న సమయంలో.. ఆయన కళ్లు భావోద్వేగంతో చెమర్చుతాయి. దీని నిర్మాణంలో ఏకంగా తొమ్మిది ప్రయత్నాలు చేశాడంటే.. విమాన నిర్మాణంపై ఆయనకు గల ప్రేమ అర్థం చేసుకోవచ్చు.
''ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌కు ముందు అనేక ప్రయత్నాలు జరిగాయి. వీటిలో మొదటిది 60వ దశకంలో నిర్మించిన గ్లైడర్. అయితే అప్పట్లో రెక్కల కోసం సరైన లోహం లేకపోవడంతో ఆ ప్రయత్నం మూలకు పడింది. ఇక అది ఎన్నటికీ ఎగరలేదు. ప్రస్తుతం ఆ పాత విమానం తాలూకు ఫోటోలు మాత్రమే మిగిలి ఉన్నాయి.''
-అడాల్ఫో రివేరా
కల సాకారం దిశగా..
సరైన పరికరాల లభ్యత లేకపోవడంతో రివేరా విమాన నిర్మాణం కలగానే ఉండిపోయింది. అతని అంచనాల ప్రకారం.. విమానం తయారీకి ఇప్పటివరకు 6,600 అమెరికన్ డాలర్లు ఖర్చైంది. అక్కడ సగటు జీతం నెలకు 100 డాలర్లు మాత్రమే. క్యూబా వంటి ద్వీపదేశంలో ఒక వ్యక్తికి ఉన్న చిన్న కల సాకారం అంత సులువైనది కాదంటాడు రివేరా. ఒకప్పటి సోషలిస్ట్ పాలనలో చదువుకున్న రివేరా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశాడు.
సాధారణంగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బట్టలు, బూట్లు నిండిన సూట్‌కేసులతో తిరిగి వస్తాం. కానీ రివేరా మాత్రం.. విమాన తయారీకి సంబంధించిన పుస్తకాలు, విడి భాగాలను కొనుక్కొచ్చేవాడంటే అతనికి విమాన నిర్మాణంపై ఉన్న ఆసక్తిని గమనించవచ్చు.
ఇదీ చదవండి: విమానం నుంచి పడిన వస్తువులు- తప్పిన ముప్పు