చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో.. అమెరికా కూడా అదే బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయి. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన సామాజిక మాధ్యమ యాప్‌లను నిషేధించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. 'ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ కన్నాముందే బహిరంగపరచడం ఇష్టం లేదు, కానీ.. కచ్చితంగా చైనా యాప్‌లను నిషేధించే యోచనలో ఉన్నాం' అని మైక్ పాంపియో స్పష్టం చేశారు.
విదేశాల్లో ఉన్న సర్వర్ల ద్వారా.. భారతీయుల డేటాను ఆయా యాప్‌లు తరలిస్తున్నాయనే ఫిర్యాదులతో భారత్ టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌ల్ని నిషేధించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికా కూడా పరిశీలిస్తోంది. వాణిజ్య యుద్ధం మొదలు, కరోనా వైరస్ వ్యాప్తి వరకూ అనేక అంశాల్లో చైనాతో అమెరికాకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. వేర్వేరు కారణాలతో చైనా టెలికాం సంస్థలపైనా.. అమెరికా పలు ఆంక్షలు విధించింది. తాజాగా యాప్‌లపైనా దృష్టి సారించింది.
ఇదీ చూడండి:- అగమ్యగోచరంగా చైనా యాప్‌ల భవితవ్యం