కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచదేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 2,87,146 మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య కోటి 74 లక్షలకు ఎగబాకింది. మరో 6,426 మంది మరణించగా.. మొత్తం 675,967 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. కొత్తగా 68,569 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశవ్యాప్తంగా కేసులు 46.36 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 55 వేలకు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 1,465 మంది మరణించారు.
బ్రెజిల్..
అగ్రరాజ్యం తర్వాత బ్రెజిల్లో కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. మరో 58 వేల కేసులు నమోదుతో బ్రెజిల్లో కేసుల సంఖ్య 26.13 లక్షలకు ఎగబాకింది. 1,189 మంది బాధితులు వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 91 వేలు దాటింది.
దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికాలో 11 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఆఫ్రికా దేశంలో కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువవుతోంది. 24 గంటల్లో 315 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 7,812కి పెరిగింది.
కొలంబియా, పెరూ దేశాల్లో
కొలంబియాలో వైరస్ తీవ్రమవుతోంది. రికార్డు స్థాయిలో 9,965 కేసులు గుర్తించారు అధికారులు. దేశంలో కేసుల సంఖ్య 2.86 లక్షలకు చేరినట్లు తెలిపారు. మరో 356 మంది బాధితుల మరణంతో మృతుల సంఖ్య 9,810కి పెరిగినట్లు స్పష్టం చేశారు.
పెరూలో కొత్తగా 6,809 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,07,492కి పెరిగింది. మరణాల సంఖ్య 19 వేలు దాటింది.
మెక్సికోలో మరణ మృదంగం
మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 45 వేల మార్క్ అధిగమించింది. కొత్తగా 5,752 కేసులతో దేశంలో బాధితుల సంఖ్య 4,08,449కి పెరిగింది.
వియత్నాంలో షురూ!
గత 99 రోజులుగా వైరస్‌పై విజయవంతంగా పోరు సాగించిన వియత్నాంలో కొత్తగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాని ఈ దేశంలో తాజాగా 48 కొత్త కేసులు గుర్తించారు అధికారులు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కేవలం 509 ఉండగా.. ఇందులో 369 మంది ఇప్పటికే కోలుకున్నారు.
పరిస్థితులు చక్కబడుతున్న సమయంలో కేసులు ఉద్భవించడం వల్ల మళ్లీ ఆంక్షలను విధించింది ప్రభుత్వం. దాదాపు 80 వేల మంది పర్యటకులను స్వస్థలాలకు వెళ్లాలని ఆదేశించింది. భవిష్యత్తులో వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 46,34,985 | 1,55,285 |
బ్రెజిల్ | 26,13,789 | 91,377 |
రష్యా | 8,34,499 | 13,802 |
దక్షిణాఫ్రికా | 4,82,169 | 7,812 |
మెక్సికో | 4,08,449 | 45,361 |
పెరూ | 4,07,492 | 19,021 |
చిలీ | 3,53,536 | 9,377 |
స్పెయిన్ | 3,32,510 | 28,443 |
యూకే | 3,02,301 | 45,999 |
ఇదీ చదవండి: సరైన వెంటిలేషన్ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే!