ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు చాలా మంది వైద్య శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి మహమ్మారి వైరస్‌ను తరిమికొట్టాలని చూస్తున్నారు. అయితే ఒక వ్యక్తిలో వైరస్‌పై వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేసేందుకు ఎంతమేర వ్యాక్సిన్ ఇవ్వాలి? ఒకవేళ అది వికటిస్తే.. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందా? వంటి ప్రశ్నలు శాస్త్రవేత్తలను ఆలోచింపచేస్తున్నాయి. ఫలితంగా వ్యాక్సిన్ ప్రయత్నాలు కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిని కోతులు, ఫెర్రెట్లు (ముంగిసలాంటి జంతువు)తో పాటు ఇతర జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
ఎన్నో ఫ్లూ వైరస్‌లకు వ్యాక్సిన్ అభివృద్ధిలో ఫెర్రెట్లు కీలకంగా వ్యవహరించాయి. అందుకే కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ వీటిపైనే ముందుగా ప్రయోగిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌తో మానవ శరీరంలాగే స్పందించి జంతువులు కరోనాను అడ్డుకోగలవా? అని పరిశోధకుల మదిలో మరో ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే మనుషుల తరహాలో ఏ జంతువులోనూ కరోనా లక్షణాలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ వికటిస్తే పరిస్థితి ఏంటి అన్న కోణంలో ఎలుకలు, ఫెర్రెట్లు, కోతులపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం జంతువులతో పాటు మనుషులపైనా ఏకకాలంలో పరీక్షిస్తున్నారు.
" మనిషిలో కనిపించే శ్వాసకోశ సంబంధిత సమస్యలను ఫెర్రెట్లలో గమనించాం. ఫెర్రెట్లకు కూడా జ్వరం, దగ్గు, తుమ్ములు వస్తాయి. తద్వారా అవి కూడా ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశముంది. అందుకే మనుషులకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ఫెర్రెట్లు ఉపయోగపడతాయి."
- అలీసన్ కెల్విన్, కెనెడా డల్హౌహీ యూనివర్సిటీ శాస్త్రవేత్త
అయితే ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, చైనాకు చెందిన సినోవాక్... కోతులపై జరిపిన పరిశోధనల్లో వేర్వేరు కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి పద్ధతులను అనుసరించారు శాస్త్రవేత్తలు. ఇందులో ఏ పద్ధతిలోనూ వ్యాక్సిన్ వల్ల కోతుల్లో దుష్ప్రభావాలు తలెత్తలేదు.
అయితే ఇక్కడ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు మరో సందేహం వచ్చింది. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలదా? అన్న అనుమానం పరిశోధకుల మదిలో మెదిలింది.
కొవిడ్-19 వైరస్ జనకాలు ఉన్న మొత్తంలోనే వ్యాక్సిన్‌ను అందిస్తే.. జంతువులకు కరోనా సోకకుండా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.