కేసులు, మరణాలు నిలకడగా ఉండటం వల్ల.. కరోనా వైరస్‌పై పోరులో అమెరికా తదుపరి దశ చేరుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇది ఎంతో సురక్షితమైనదని పేర్కొన్నారు.
"కేసులు, మరణాల సంఖ్య నిలకడగా ఉంది. ఎన్నో ప్రాణాలను కాపాడాము. ప్రజలకు ధన్యవాదాలు. వైరస్‌పై పోరులో మన దేశం తదుపరి దశలో ఉంది. ఇది ఎంతో సురక్షితమైనది. దేశాన్ని తిరిగి తెరిచే దశ ఇది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికావ్యాప్తంగా వైరస్ మరణాల సంఖ్య 71వేలు దాటింది. 12లక్షలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ప్రపంచంలో ఈ స్థాయిలో కేసులు, మరణాలు ఎక్కడా లేవు.
అయితే గత వారం రోజులుగా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
3వేలకు రోజువారీ మృతులు...!
ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధణరకు ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో.. జూన్ నాటికి రోజువారీ వైరస్ మరణాలు 3,000కు చేరవచ్చన్న నివేదిక కలకలం రేపుతోంది. అయితే ఈ నివేదికను ట్రంప్‌తో పాటు శ్వేతసౌధం ఖండించింది. తప్పుడు అంచనాలతో ఈ నివేదికను రూపొందించినట్టు మండిపడింది ప్రభుత్వం.
జూన్ 1 నాటికి రోజువారీ కేసులు 20వేలు దాటుతాయని, మరణాలు 3వేలకు చేరుతాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా వేసింది. అయితే తాము రూపొందించిన నివేదిక.. అత్యవసర నిర్వహణ సంస్థ (ఎఫ్ఈఎమ్ఈ) కోసమని, ఇవి అధికారిక అంచనాలు కావని స్పష్టం చేసింది.
న్యూయార్క్ బయట వైరస్ వ్యాప్తి!
న్యూయార్క్‌లో వైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోందని ఓ నిపుణుల బృందం గుర్తించింది. అయినప్పటికీ అనేక రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తుండటం ఆందోళనకర విషయమని పేర్కొంది.
టాస్క్‌ఫోర్స్‌కు స్వస్తి!
కరోనా వైరస్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ను నిలిపివేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. ఆ టాస్క్‌ఫోర్స్ బాధ్యతల్ని సంబంధిత ఫెడరల్ సంస్థకు అప్పగించే అవకాశముందన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు పెన్స్ నేతృత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి:- న్యూయార్క్ చిన్నారుల్లోనూ అంతుచిక్కని అనారోగ్యం