కరోనా మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం ఆవశ్యకత అంశంపై భారత్ సహా మొత్తం 6 దేశాల విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమెరిగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. కొవిడ్‌ను జయించేందుకు పరస్పర సహకారం, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆరు దేశాల ప్రతినిధులతో చర్చించినట్లు అగ్రరాజ్యం అధికార ప్రతినిధి తెలిపారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులు మరైస్ పేనీ, ఎర్నెస్టో హెర్నిక్, యిస్రాయెల్ కట్జ్, టారో కోనో, కంగ్ క్యుంగ్ వాలతో పాంపియో మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు..
సమావేశం ఫలవంతం
కరోనా సవాళ్లను ఎదుర్కోనే అంశంపై జరిగిన సమావేశం సుదీర్ఘంగా జరిగినట్లు చెప్పారు జైశంకర్. చర్చ ఫలవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు. వైద్య రంగంలో సహకారం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రయాణ ఆంక్షలపైనా చర్చించినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 2,86,000 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. 41లక్షల 78వేల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. అమెరికా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఆ దేశంలో 80వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 13లక్షల 50వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.