కరోనా కట్టడి కోసం వైరస్ మొదలైన తొలినాళ్లలో ప్రపంచంలోని పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో చాలా మంది ఇళ్లకే పరిమితయ్యారు. దీనివల్ల వారి ఆహారపు ఆలవాట్లు, నిద్ర నాణ్యత, మానసిక ఆరోగ్యం విషయాల్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఊబకాయ రోగులపై అధిక ప్రభావం పడినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఒబేసిటీ జర్నల్‌లో ప్రచురితమైంది.
లూసియానా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా 50కి పైగా దేశాలకు చెందిన 7,754 మంది పాల్గొన్నారు. ఈ తరహా సర్వే నిర్వహించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
సర్వేలో వెల్లడైన విషయాలు..
- బయట తినే అవకాశం లేకపోవడం వల్ల ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం పెరిగింది. చిరుతిళ్లు కూడా అధికమయ్యాయి.
- వ్యాయామం తక్కువగా చేశారు.
- తరచూ బెడ్‌పై ఉండటం వల్ల నిద్ర నాణ్యత తగ్గింది.
- చింతించడం రెట్టింపయ్యింది.
- అధిక బరువు ఉన్నవారు డైట్‌ను మెరుగుపర్చుకున్నారు. కానీ వాళ్లలో మానసిక ఆరోగ్యం క్షీణించింది.
- ఊబకాయం ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు బరువు పెరిగారు.
ఈ సర్వే అనంతరం ఊబకాయం ఉన్న రోగులకు చికిత్స విధానాన్ని మార్చాలని వైద్యులకు కొన్ని సూచనలు చేశారు పరిశోధకులు. ఒకటి.. రోగుల మానసిక ఆరోగ్యంపై తరచూ స్క్రీనింగ్ నిర్వహించాలి. రెండోది వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు టెలిఫోన్ ద్వారా అందుబాటులో ఉండి పర్యవేక్షించాలి.