కరోనా చికిత్సకు సంజీవనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ దుష్ప్రభావం చూపుతుందని ఆ దేశ ఆహార, ఔషధ పరిపాలన(ఎఫ్‌డీఏ) విభాగం తెలిపింది. ఈ మందు వల్ల తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. తీవ్ర వైరస్ ప్రభావంతో బాధపడుతూ.. అత్యవసర విభాగంలో ఉన్న రోగలకు మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వాలని సూచించింది ఎఫ్‌డీఏ.
అప్పుడే చెప్పింది..
మలేరియా ఔషధం ఉపయోగించడానికి ఆమోదం తెలిపినప్పుడే ఈ నష్టాలు గురించి ఎఫ్‌డీఏ వెల్లడించింది. వైరస్ బాధితులు ఆసుపత్రి లేదా క్లినికల్ ట్రయల్స్‌లో వైద్య నిపుణులు పర్యవేక్షణలో ఉన్నప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వవచ్చని సూచించింది.
"రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి వైద్యులు తమకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటారు. వైద్యులు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని వారికి అందిస్తున్నాం. కొవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న ఔషధాల భద్రత, ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి."
- స్టీఫెన్ ఎం హాన్, ఎఫ్‌డీఏ కమిషనర్
మరింత సమాచారం..
కరోనా చికిత్సలో వినియోగిస్తున్న ఔషధాలపై పరిశోధన జరిపి, వాటివల్ల వచ్చే ప్రమాదాల గురించి మరింత సమాచారం అందుబాటులో ఉంచుతామని స్టీఫెన్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా తర్వాతి టార్గెట్ ఆసియానేనా!