ప్రపంచంపై కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్ వేగంగా చేపడుతున్న దేశాల్లోనూ కేసులు భారీగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గత 3 రోజులుగా రోజువారీ కేసులు లక్షకుపైగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 1,30,706 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 750 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
'50 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి'
అమెరికాలో 50 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 8,21,000 డోసుల పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. 'గతవారం కొత్తగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సగటు 11 శాతానికి చేరుకుంది. అంతకు ముందు రెండు వారాల్లో 44శాతం పూర్తయింది. అన్ని వయస్సుల అమెరికన్లు 50శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. అమెరికా ముందుకు సాగుతోంది' అని ట్వీట్ చేశారు శ్వేతసౌధం కొవిడ్-19 సమాచార డైరెక్టర్ సైరస్ షాహ్‌పర్. మరోవైపు.. రష్యా, చైనా వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ పర్యటకుల అనుమతిపై బైడెన్ పరిపాలన విభాగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మెక్సికోలో రెడ్ అలర్ట్..
మెక్సికో నగరంతో పాటు 6 రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రమంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. శుక్రవారం నాటికి మెక్సికోలో 1,44,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత జనవరిలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నసమయంలో కంటే 4.6 శాతం ఎక్కువ. 2,43,733 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. వాస్తవంగా 3,70,000 మందివరకు చనిపోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 25 శాతం దేశం హైఅలర్ట్‌లో ఉంది. ఆ ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
చైనాలో మళ్లీ ఆంక్షలు..
చైనాలోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 80 కేసులు వెలుగు చూశాయి. వీటిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్‌ఝౌ నగరంలోనివే. కొద్ది రోజుల క్రితం నాన్జింగ్ విమానాశ్రయంలో డెల్టా కేసులు బయటపడిన తర్వాత ఇప్పటి వరకు 1,200 మందికి వైరస్ వ్యాపించింది. దీంతో చైనా మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్జింగ్ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయటం, ప్రయాణాలపై నిషేధం విధించింది.
కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న మరో 5 దేశాలు..
- బ్రెజిల్‌లోనూ వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. శుక్రవారం కొత్తగా 42వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వెయ్యి మందికిపైగా మరణించారు. 28వేల మంది వైరస్‌ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 2,010,8,746కు చేరింది.
- ఇండోనేసియాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 39వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. 1635 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 వేల మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3,607,863, మరణాలు 1,04,010కు చేరింది.
- ఇరాన్‌లోనూ కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కొత్తంగా 34వేల మందికి వైరస్ అంటుకుంది. 458 మంది మరణించారు.
- బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా 31వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. 92 మంది మరణించారు. 14వేల మంది కోలుకున్నారు.
- ఫ్రాన్స్‌లో 25వేలు, టర్కీలో 23వేలు, రష్యాలో 22వేలు, స్పెయిన్‌లో 21వేలు, మలేషియాలో 20వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల్లో వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో కొత్త ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
ఇదీ చూడండి: మళ్లీ కొవిడ్ విజృంభణ- అమెరికాలో రోజుకు లక్ష!