ప్రపంచ ప్రమాదకర వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్ఓ - pandemic
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాగా ఈ వైరస్‌ను పాన్‌డెమిక్(ప్రమాదకర వ్యాధి)గా పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. మరోవైపు కరోనా వైరస్ మరణాల జాబితాలో ఒక్కో దేశం వచ్చి చేరుతోంది. తాజాగా స్విడెన్, ఇర్లాండ్లో తొలి మరణాలు సంభవించాయి. వైరస్ భయంతో కువైట్.. తన విమాన సేవలను రద్దు చేసుకుంది. కరోనాతో పోరుకు వివిధ దేశాలు తమ ఆర్థిక అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19ని 'ప్రమాదకర వ్యాధి'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
"కోవిడ్-19ని పాన్‌డెమిక్(ప్రమాదకర వ్యాధి)గా పేర్కొనవచ్చు. కరోనా వైరస్ ఈ స్థాయిలో విజృంభించడం మనం మునుపెన్నడు చూడలేదు."
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
వైరస్ కేంద్రబిందువైన చైనాలో.. ఇప్పటివరకు 3,100మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. సుమారు 81వేల వైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షా 14వేలకుపైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
జీ7 దేశాలు...
అమెరికాలోని పిట్స్బర్గ్ వేదికగా ఈ నెలలో జరగాల్సిన జీ7 దేశాల మంత్రుల సమావేశంపై కరోనా ప్రభావం పడింది. అమెరికాలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని నిర్ణయించారు.
ఒకే రోజు 238 కేసులు...
బుధవారం ఖతార్వాసులను కరోనా వైరస్ భయాందోళనకు గురిచేసింది. ఒక రోజులో ఏకంగా 238 కేసులు నమోదవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 262కు చేరింది.
దేశంలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే వైరస్ కట్టడికి అనేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఖతాల్ వ్యాప్తంగా అన్ని పాఠశాలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. అనేక క్రీడా వేడుకలు రద్దయ్యాయి.
మరణాలు..
ఐరోపాలోని స్విడెన్, ఐర్లాండ్‌లో కరోనా వల్ల తొలి మరణాలు సంభవించాయి.
చైనా తర్వాత వైరస్‌తో ఎక్కువ ప్రభావితమైన దేశం ఇటలీ. ఫలితంగా ఇటలీ నుంచి ఒక్క దేశం సంబంధాలు తెంచుకుంటోంది. తాజాగా ఇటలీ సరిహద్దు దేశమైన ఆస్ట్రియా వైరస్ కట్టడికి పలు చర్యలు చేపట్టింది. ఇటలీ వెంబడి ఉన్న సరిహద్దుపై పలు ఆంక్షలు విధించింది. ఇటలీకి రైలు, విమాన సేవలను ఇప్పటికే రద్దు చేసుకుంది ఆస్ట్రియా.
విమానాలు రద్దు..
కరోనా వైరస్ ప్రభావం విమాన సేవలపై భారీగా పడుతోంది. ప్రపంచ దేశాలు తమ విమానాలను కరోనా బాధిత ప్రాంతాలకు పంపడానికి భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ కూడా తమ విమాన సేవలను రద్దు చేసుకుంది. ఈ శుక్రవారం నుంచి.. తదుపరి ఆదేశాలు వచ్చే అంత వరకు.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఆర్థిక అస్త్రం..
కరోనాపై పోరుకు ప్రపంచదేశాలు తమ 'ఆర్థిక' అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలు వైరస్‌పై యుద్ధానికి బిలియన్ డాలర్లను మంజురు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో కెనడా చేరింది. 1 బిలియన్ డాలర్ల నిధులను కరోనా కట్టడి కోసం వినియోగించనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.