ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి విస్తరించకుండా ఆయా దేశాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. బంద్‌లు, కర్ఫ్యూలు, ప్రయాణాలపై నిషేధాలను విధిస్తూ వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆ సూత్రాలివే..
- ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను అధికారులు మూసేశారు. దక్షిణాసియాలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ నగరం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధించారు.
- ఐరోపా సమాఖ్య దేశాలకు వెళ్లకూడదని అమెరికా పౌరుల ప్రయాణాలపై ఇటీవలే ఆంక్షలు విధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఈ నిషేధాన్ని బ్రిటన్, ఐర్లాండ్లకూ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వందమంది కంటే ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న సభలపై నిషేధం విధించారు. న్యూజెర్సీలో ఓ రాత్రి అంతా కర్ఫ్యూ విధించారు.
- వైరస్ కేంద్రబిందువు చైనాలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా కట్టడికాని నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పరిశీలించిన తర్వాతే వారిని ప్రత్యేక శిబిరాలు లేదా ఇళ్లకు పంపిస్తున్నారు.
- వైరస్ ప్రభావిత దేశాల్లో స్పెయిన్ ఐదో స్థానంలో ఉంది. ఈ కారణంగా రెండు వారాల అత్యయిక స్థితిని విధించారు ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్. ప్రధాని సతీమణి సహా 5700మంది పౌరులకు కరోనా సోకడం, 136మంది ప్రాణాలు కోల్పోయిన కారణంగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
- వైరస్ వల్ల ప్రభావితమైన దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్బంధ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆహారం, మందులు కొనేందుకు.. ఆసుపత్రులు, బ్యాంకులకు వెళ్లేందుకు.. వృద్ధులు, యువతకు అవసరమైన పర్యటనలు చేసేందుకే అనుమతిస్తున్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమాహాళ్లు వంటివన్నీ మూతపడ్డాయి.
- ఫ్రాన్స్‌లో వ్యాపార కార్యకలాపాలన్నింటినీ నేటి నుంచి నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. వందమంది కంటే ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు.
- డెన్మార్క్ సరిహద్దులను మూసేసింది. దేశంలోకి రాకపోకలను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేసింది. డెన్మార్క్ వాసులు మినహా దేశంలోకి వేరెవ్వరినీ రానివ్వబోమని ప్రకటించింది.
- పోలాండ్ సరిహద్దులను నేటి రాత్రి నుంచి మూసివేయనున్నారు. స్వదేశీయులు, పోలాండ్‌తో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారు మినహా విదేశీయులను దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, లిథుయానియా కూడా ఇలాంటి ఆంక్షలే విధించాయి.
- తమ దేశంలోకి విదేశీయులను అనుమతించబోమని ప్రకటించింది రష్యా. నార్వే, పోలాండ్ సరిహద్దులను మూసేస్తున్నట్లు స్పష్టం చేసింది.
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దేశంలోకి వచ్చేవారిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచుతున్నాయి.
ఇదీ చూడండి: విమానంలో ఒక్కరికి కరోనా- 19 మంది నిర్బంధం