కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని పూర్తిగా మార్చివేసింది. ఈ మహమ్మారి గుప్పిట్లో నుంచి బయటపడేందుకు దేశాలన్నీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి. అయితే ఈ నిర్బంధం ప్రజలను ఇబ్బంది పెడుతున్నా.. భూకంప శాస్త్రవేత్తలకు ఓ ప్రత్యేక అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
సీస్మాలజీ.. భూకంపాలకు సంబంధించి శాస్త్రం. భూమిలో ప్రకంపనలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు శాస్త్రవేత్తలు. భూప్రకంపనల శబ్దం (సీస్మిక్ నాయిస్)ను గుర్తించి భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలను గుర్తిస్తారు.
తగ్గిన శబ్ద తీవ్రత..
కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచమంతా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అన్ని రకాల రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. ఈ పరిణామాలతో శబ్ద తీవ్రత చాలా వరకు తగ్గింది.
లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, మానవ కార్యకలాపాలు, శబ్ద తీవ్రతను పెంచే ప్రయాణాలు నిలిచిపోయాయి. అయితే ఇవి ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు భూ ప్రకంపనలు ఏర్పరచలేవు. కానీ.. ఇవన్నీ కలిసి జరుగుతున్నప్పుడు శబ్దాన్ని ఉత్పత్తిచేస్తాయి. ఫలితంగా భూకంప శాస్త్రవేత్తలకు చిన్న భూకంపాలను కొలవడం కష్టమయ్యేది.
కచ్చితమైన అధ్యయనం..
భూకదలికలపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు దీన్ని ఓ అవకాశంగా భావిస్తున్నారు. అగ్ని పర్వతాలు, భూప్రకంపనలపై కచ్చితమైన అధ్యయనం చేసేందుకు ఈ పరిస్థితులు సహకరిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల చిన్న స్థాయి భూకంపాలను కూడా గుర్తించవచ్చని చెబుతున్నారు.
"శబ్ద తీవ్రత తగ్గటం వల్ల అబ్జర్వేటరీ పరికరాల సున్నితత్వం పెరిగింది. అధిక ఫ్రీక్వెన్సీ పరిధిలోని తరంగాలను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది."
-భూకంప శాస్త్రవేత్తలు
లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా భూకంప శాస్త్రవేత్తలకు చిన్న భూకంపాలను గుర్తించేందుకు, వాటి స్థానాన్ని మరింత కచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతుంది. శబ్దం తగ్గడం వల్ల ఇలాంటి ఫ్రీక్వెన్సీల్లో సహజ తరంగాల డిటెక్టర్ల సున్నితత్వం పెరుగుతుందని భూకంప శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇదీ చూడండి: ఈ ఏడాది సాధారణంకన్నా అధిక వర్షపాతం