ప్రపంచ దేశాలు కరోనా చేతుల్లో చిక్కుకుపోయాయి. స్పెయిన్‌లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి స్పానిష్ ప్రజలు గజగజలాడుతున్నారు. స్పెయిన్‌లో గత 24 గంటల్లో 864 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9,053కు చేరింది. బాధితుల సంఖ్య 1,02,136కు చేరింది.
ప్రస్తుతం అత్యధిక మృతుల జాబితాలో ప్రపంచంలో రెండోస్థానంలోనూ, ఎక్కువ మంది బాధితులు ఉన్న జాబితాలో మూడో స్థానంలోనూ ఉంది స్పెయిన్. అయితే కొత్తగా కరోనా బారిన పడేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఆ దేశ వైద్య విభాగం పేర్కొంది.
మంగళవారం నాటికి పాజిటివ్ కేసుల రేటు 11 శాతం ఉండగా.. బుధవారం 8 శాతానికి తగ్గింది. మరణాల రేటూ గణనీయంగా తగ్గింది. గత వారం 27 శాతం ఉండగా... బుధవారం 10.5 శాతమే నమోదైంది. హాట్‌స్పాట్ అయిన మాడ్రిడ్‌లో ఇప్పటివరకు 30వేల కేసులు నమోదవగా.. 3,865 మంది చనిపోయారు.
ఇరాన్ @ 3వేలు
ఇరాన్లో గత 24 గంటల్లో 138 మంది చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మొత్తం 3,036కు చేరింది. కొత్తగా 2,987 కేసులు రావడం వల్ల.. బాధితుల సంఖ్య 47వేల 893కి చేరింది. ఇందులో 15,473 మంది కోలుకున్నారు.
అమెరికాను వణికిస్తోంది..
అమెరికాలో కరోనా మరణాల సంఖ్య ఏకంగా ఓ ఉగ్రదాడినే మించిపోయింది. గత శనివారం నుంచి 2 వేలు ఉన్న మృతుల సంఖ్య.. బుధవారం ఉదయానికి 4వేలు దాటేసింది. నాలుగు రోజుల్లోనే రెట్టింపు వేగంతో అమెరికాపై పంజా విసిరింది ఈ మహమ్మారి. అందుకే ఆ దేశం 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడి మృతుల (3వేలు) కంటే ఎక్కువ మందిని కోల్పోయింది.
ఇటీవల కరోనా మృతుల జాబితాలో చైనా (3310)ను వెనక్కి నెట్టింది అమెరికా. ఈ తీవ్రత ఇలాగే కొనసాగితే 1 లక్ష నుంచి 2 లక్షల మంది అమెరికన్లను కోల్పోవాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు.. కరోనా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1లక్ష 89, 633 వేలు దాటేసింది. ఇందులో 4,081 మంది మరణించగా.. 7,138 మంది కోలుకున్నారు.
అమెరికాలోని న్యూయర్క్‌లో కొవిడ్ 19 ఎక్కువగా విజృంభిస్తోంది. ఈ ఒక్క ప్రాంతంలోనే ఏకంగా 75,000 కేసులు నమోదవగా.. వీరిలో 1,550 మంది మృతి చెందారు. బాధితులతో ఆసుపత్రులు నిండిపోగా.. తాత్కాలికంగా టెన్నిస్ మైదానాల్లో వైద్యానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధాన్నే తలదన్నేలా...
ఐరోపాలో కరోనా మృతుల సంఖ్య 30వేలు దాటింది. రెండో ప్రపంచ యుద్ధం కన్నా ఈ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఈ ఖండంలో మొత్తం 4,68,792 కేసులు నమోదవగా.. 31,083 మంది మృతి చెందారు.
- ఇటలీలో 1లక్షా 5,792 మంది ఈ వైరస్ బారిన పడగా.. మృతుల సంఖ్య 12 వేల 428 కి చేరింది. 15,729 మంది కోలుకున్నారు.
- ఫ్రాన్స్‌లో మొత్తం 52,128 కేసులు నమోదవగా.. 3,523 మంది మరణించారు.
- చైనాలో మంగళవారం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7 మరణాలు, 36 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 81,554 కేసులు నమోదవగా.. 3,312 మంది మరణించారు. 76,238 మంది కోలుకున్నారు.
బొత్సవానా, స్లోవేకియా, కాంగో బ్రజవిల్లే, ఎల్ స్లేవడార్లో తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల 65 వేల 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 43 వేల 82 మంది చనిపోయారు.