కరోనా ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే అమెరికాలో 13వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆ దేశంలో మహమ్మారి ఉద్ధృతికి అద్దం పడుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 68, 572 మంది వైరస్ బారినపడ్డారు. 1, 031 మంది మృతి చెందారు.
న్యూయార్క్ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. భవిష్యత్‌లో బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిఫుణులు చెబుతున్నారు. దీంతో కరోనాను అతిపెద్ద ఆరోగ్య విపత్తుగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
ఇదే మొదటిసారి..
ఇటీవల కాలంలో అమెరికాలో దాదాపు ఆరు రాష్ట్రాల్లో అరోగ్య విపత్తును ప్రకటించటం ఇదే మొదసారి. చాలా రాష్ట్రాల్లో అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్‌లో పరిస్థితి ఏ మాత్రం కుదుటపడలేదని ఆ దేశ ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే న్యూయార్క్‌కు సహాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
"ఇది మాకు అతిపెద్ద సమస్య కావచ్చు. కాకపోవచ్చు. అయితే చాలా మంది సమర్థులైన వారు మాతో కలిసి పని చేస్తున్నారు. మా బృందాలు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయి."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
భారీ ప్యాకేజీ..
దాదాపు 100మిలియన్ల మంది అమెరికా పౌరులు లాక్డౌన్ పరిస్థితుల్లో నివసిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో నివారణ చర్యలను చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. దీనికి అమెరికా ఎగువ సభ అమోదం తెలిపింది. అయితే బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలపాల్సి ఉంది.